సాక్షి, చైన్నె: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘ తాయ్ మామన్ బంగారు ఉంగరం’ (మేన మామ బంగారు ఉంగరం పథకం) పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతున్నది. సెప్టెంబర్ 15న అధికారికంగా ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకం కింద మొదటి విడతగా 1,28,499 మంది శిశువులకు 1 గ్రాముు బంగారు ఉంగరాలను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రెండు ప్రముఖ జ్యువెలరీ సంస్థలకు పనుల కాంట్రాక్ట్ ఆర్డర్లు జారీ చేశారు.ఈ మేరకు తమిళనాడు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. టీవీకే చీఫ్ విజయ్ ఎన్నికల వాగ్దానంగా ప్రతి తోబుట్టువుకు తాను అన్నయ్యనంటూ, వారికి పుట్టబోయే బిడ్డలకు తాను మేన మామగా ఉంటానని ప్రకటించుకున్నారు. ఆ మేరకు అధికారంలోకి వచ్చినానంతరం తాయ్‌మామన్ బంగారు ఉంగరం పథకం పుట్టేబిడ్డ కోసం అమలు చేయడానికి నిర్ణయించారు.
ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ ఆసుపత్రులలో జూన్ 22 నుండి జన్మించిన ప్రతి బిడ్డను, తల్లిని గౌరవించడంతో పాటు ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం అమలుకు బడ్జెట్‌లో నిధులను సైతం కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే శిశువుల కోసం ఒక గ్రాము బంగారు ఉంగరాలను అందించడానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
టెండర్ల ఖరారు
తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ గత నెల టెండర్లను ఈ పథకం కోసం ఆహ్వానించింది. మొత్తం 11 సంస్థలు పాల్గొనగా, అతి తక్కువ ధరను కోట్ చేసిన ‘జాయ్ అలుక్కాస్’, ‘కల్యాణ్ జ్యువెలర్స్’లను తాజాగా ఈ పథకం నిమిత్తం ఎంపిక చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.దివంగత మాజీ సీఎం అన్నా దురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ పథకం అమలుకు సిద్ధమయ్యారు. జూన్ నెల నుండి 4 నెలల కాలానికి అవసరమయ్యే 1,28,499 బంగారు ఉంగరాల సరఫరా బాధ్యతను జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్ సంస్థలకు 70:30 నిష్పత్తిలో కేటాయిస్తూ ఆర్డర్లు జారీ చేసినట్టు అధికారులు ప్రకటించారు.


