సాక్షి, చైన్నె: దక్షిణభారత దేశానికి తలమానికమైన చైన్నె నగరం తన 387వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం జరుపుకుంది. మద్రాసు డే వేడుకలు పలు చోట్ల ఘనంగా జరిగాయి. 1639లో బ్రిటిష్ వారు ఫోర్ట్ సెయింట్ జార్జ్ నిర్మాణానికి స్థలాన్ని కొనుగోలు చేసిన రోజును పురస్కరించుకుని ఏటా ఈ వేడుకలను నిర్వహిస్తారు.చైన్నె దినోత్సవపురస్కరించుకుని అర్థరాత్రి మెట్రో రైలులో కేక్ కట్టింగ్ చేశారు. చరిత్రలోనే మొదటిసారిగా చైన్నె మెట్రో రైలును ఒక ప్రదర్శన వేదికగా మార్చడం విశేషం. సాధారణ సర్వీసులు ముగిశాక, కోయంబేడు మెట్రో స్టేషన్‌లో అర్థరాత్రి 12 గంటలకు హ్యాపీ బర్త్‌డే చైన్నె అంటూ కేక్ కట్ చేశారు. కోయంబేడు నుండి ఎయిర్‌పోర్ట్ వరకు 2 గంటల పాటు కదిలే మెట్రో రైలులోనే లైవ్ మ్యూజిక్ కచేరీ, డ్యాన్స్ , పాటలతో ప్రయాణికులు ఉత్సాహంగా జరుపుకున్నారు.
అన్నా లైబ్రరీలో చారిత్రక ఫోటో ప్రదర్శన:
కొట్టురుపురంలోని అన్నా సెంటెనరీ లైబ్రరీలో చైన్నె నగర పరిణామ క్రమాన్ని తెలిపే అరుదైన ఫొటోల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఆగస్టు 31 వరకు ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రదర్శనను మంత్రి రాజ్ మోహన్, రాజేష్‌కుమార్‌లు ప్రారంభించారు. ఇక్కడి ఫొటోలను వీక్షించారు. ఇక, సీఎం విజయ్, మాజీ సీఎంలు ఎం.కె. స్టాలిన్, పళణి స్వామి, ఎంపీ కనిమొళి , పీఎంకే నేత రాందాసు తదితరులు చైన్నె వాసులకు మద్రాసు డే శుభాకాంక్షలు తెలియజేశారు.


