– 12 జిల్లాల్లో 17 లక్షల ఎకరాలకు జీవనాడి
సాక్షి, చైన్నె: కావేరీ నదిపై నిర్మించిన తమిళనాడులోని చారిత్రాత్మక మెట్టూరు డ్యామ్ 92 ఏళ్లు పూర్తి చేసుకుని, 93వ సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. తమిళనాడులోని కావేరీ డెల్టా ప్రాంతపు వ్యవసాయానికి ఈ ఆనకట్ట ప్రధాన ఆధారంగా నిలుస్తోంది.
చారిత్రక నేపథ్యం – నిర్మాణ విశేషాలు
కావేరీ నీటిని నిల్వ చేసి సాగుకు అందించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1925లో నిర్మాణాన్ని ప్రారంభించగా, 1934 జూలై 14న పూర్తయింది. అప్పటి చైన్నె గవర్నర్ సర్ జార్జ్ ఫ్రెడరిక్ స్టాన్లీ ద్వారా 1934 ఆగస్టు 21న రూ. 4.80 కోట్ల వ్యయంతో ఈ ఆనకట్ట ప్రారంభించబడింది. రూపశిల్పి, సూపరింటెండింగ్ ఇంజనీర్ కల్నల్ ఎల్లిస్ జ్ఞాపకార్థం దీనికి స్టాన్లీ రిజర్వాయర్ , ఎల్లిస్‌శ్రీ పేరుతో కూడా పిలుస్తారు. ఈ డ్యామ్ పొడవు 5,300 అడుగులు, గరిష్ట నీటిమట్టం 120 అడుగులు కాగా, మొత్తం నిల్వ సామర్థ్యం 93.5 టీఎంసీలు. వరద నీటిని విడుదల చేయడానికి 16 స్లూయిస్ గేట్లు ఉన్నాయి.
వ్యవసాయ ప్రయోజనాలు
సేలం, కరూర్, తిరుచి, తంజావూరు, తిరువారూర్, నాగపట్టణం సహా 12 జిల్లాల్లోని సుమారు 17 లక్షల ఎకరాల సాగుభూమికి ఈ డ్యామ్ నీటిని అందిస్తున్నది. ప్రస్తుతం డ్యామ్‌లో నీటిమట్టం 85.17 అడుగులుగా ఉండి, 47.30 టీఎంసీల నీటి నిల్వ ఉంది. డ్యామ్‌లోనికి ఇన్‌ఫ్లో సెకనుకు 10,414 క్యూసెక్కులుగా నమోదు కాగా, తాగునీటి అవసరాల కోసం సెకనుకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత నాలుగైదేళ్లుగా ఏటా నిర్ణీత జూన్ 12వ తేదీన తెరచుకున్న ఈ డ్యాం గేట్లు, ఈ ఏడాది తెరచుకోలేదు. కాస్త ఆలస్యంగానైనా పలు సందర్భాలలో తెరచుకున్న ప్పటికీ, ఈ ఏడాది ఇంత వరకు డ్యాం నుంచి సాగుకు నీరు అందక పోవడంతో డెల్టా అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు.


