సాక్షి, చైన్నె: కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, రామనాథపురం జిల్లాలో గురువారం వరకు అలలు ఉవ్వెత్తున ఎగసి పడనున్నాయి. జాలర్లు అమ్రత్తంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ అయ్యా యి. ఎలాంటి ముందుస్తు హెచ్చరికలు లేకుండా సముద్రంలో ఒక్కసారిగా ఎగసిపడే భారీ అలలకు అవకాశం ఉందన్న సమాచారాలు రావడంతో ’కళ్లకుడల్’(స్వెల్ సర్జ్) ముప్పు అలర్ట్ ప్రకటించారు.
‘కళ్లకుడల్’ అంటే ఏమిటి?
కళ్లకుడల్’ అనే పదం మలయాళ భాష నుండి వచ్చింది. కళ్లన్ + కడల్’, అంటే కళ్లన్ అనగా దొంగ. దొంగలాగా ఎలాంటి శబ్దం లేదా ముందస్తు సూచన లేకుండా జనావాసాలు ఉండే తీర ప్రాంతాల్లోకి విరుచుకుపడే సముద్ర నీరు అనే అర్థంలో ఈ పేరు పెట్టారు.
ప్రభావిత ప్రాంతాలు:
కేరళ, దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, లక్షద్వీప్ ప్రాంతాలకు ఈ కళ్లకుడల్ హెచ్చరికలు వర్తిస్తారయి. బుధవారం నుండి గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు ఈ అలల ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు , మత్స్యకారులు హఠాత్తుగా ఎగసిపడే అలల పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్న పడవల (కంట్రీ బోట్లు) మత్స్యకారులు తీరప్రాంతాల్లో అలల తీవ్రత ఎక్కువగా ఉన్నందున సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కోరారు. బోట్లు ఒకదానికొకటి ఢీకొని దెబ్బతినకుండా ఉండేందుకు, వాటి మధ్య తగినంత దూరం పాటిస్తూ లంగరు వేయాలని సూచించారు. సముద్రంలోకి వెళ్లిన చిన్న చిన్న పడవలను తిరుగు ప్రయాణం అయ్యే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. సముద్రంలోకి వెళ్లి మరీ భద్రతా బలగాలు జాలర్లను అప్రమత్తం చేసి వెనక్కు రప్పించడమే కాకుండా,అ ప్రమత్త, భద్రతా పరమైన సూచనలు చేస్తున్నారు.


