సాక్షి, చైన్నె : కోయంబత్తూర్ తదితర ప్రధాన రైల్వే స్టేషన్లలోని వాటర్ కూలర్లలో ప్రమాదకరమైన ఈ–కోలై బాక్టీరియా ఉన్నట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. లోక్‌సభలో సమర్పించిన ఈ నివేదిక ప్రయాణికుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌ను రోజుకు సుమారు 60 వేల మందికి పైగా ప్రయాణికులు ఉపయోగిస్తుంటారు. సేలం రైల్వే డివిజన్ పరిధిలోని 94 రైల్వే స్టేషన్లలో అత్యధిక ఆర్జించే స్టేషన్‌గా కోయంబత్తూర్ ప్రథమ స్థానంలో ఉంది.కాగ్ నివేదిక ప్రకారం, దక్షిణ రైల్వే ప్రయాణికుల సౌకర్యాల కోసం కేటాయించిన నిధుల్లో 45 శాతం నుండి 77 శాతం వరకు నిధులను అసలు ఉపయోగించలేదని పేర్కొంది. అంతేకాకుండా ప్రయాణికుల వసతులు, పరిశుభ్రత, తాగునీటి నాణ్యతలో లోపాలు ఉన్నాయని, వాటర్ కూలర్ల నుంచి సేకరించిన నీటి నమూనాలలో ఈ–కోలై బాక్టీరియా ఉన్నట్లు స్పష్టమైందని వెల్లడించింది.
ఆగ్రహం
విషయమై రైలు ప్రయాణికులు స్పందిస్తూ , దేశంలో పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యంత నమ్మకమైన రవాణా వ్యవస్థ రైల్వేగా పేర్కొంటూ, రోజూ వేలాదిమంది ప్రయాణించే ప్రదేశాల్లో కనీస పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రజల ప్రాథమిక హక్కుగా వివిరంచారు. ప్రయాణికుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నీటి నాణ్యతను పెంచి, సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌లోని 6 ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 80 తాగునీటి కుళాయిలు ఉన్నాయని రైల్వే అధికారులు వివరించారు. కోయంబత్తూర్ కార్పొరేషన్ నుంచి వచ్చే నీటినే ప్రయాణికులకు అందిస్తున్నామని, నెలకు ఒకసారి నీటి నమూనాలను పరీక్షించి సరఫరా చేస్తామన్నారు. సీఏజీ నివేదికపై కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ మార్గదర్శకాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేషన్ ఇంజనీర్లు పేర్కొంటూ, తాము స్టేషన్‌కు నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ, దాన్ని వారు ఎలా నిల్వ చేసి పంపిణీ చేస్తున్నారో చూడాల్సి ఉందన్నారు. ఈ–కోలై బాక్టీరియా చేరిందంటే మురుగునీరు కలవడం వల్లే సాధ్యమవుతుందని, తాము అనేక పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే మంచి నీటిని సరఫరాకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.


