– అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వ్యవహారం
సాక్షి, చైన్నె: విప్ ఆదేశాలను ధిక్కరించి ఓటు వేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఆ పార్టీయే క్షమించినప్పుడు, వారు తిరిగి పార్టీ సభ్యులుగానే కొనసాగుతారని... అలాంటప్పుడు వారిపై అనర్హత వేటులను ఉపసంహరించుకోవడంలో తప్పేముందని చైన్నె హైకోర్టు ప్రశ్నించింది. తమిళనాడు శాసనసభలో మే 13న ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం సందర్భంగా, విప్ ఆదేశాలను ఉల్లంఘించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
క్షమాపణ లేఖలు..
ఈ పరిణామాల మధ్య నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, మిగిలిన 21 మంది ఎమ్మెల్యేలు క్షమాపణ కోరుతూ పార్టీకి లేఖలు రాశారు. దీంతో వారిపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఎడప్పాడి పళనిస్వామి స్పీకర్‌కు తెలియజేయగా, స్పీకర్ కూడా ఆ చర్యలను నిలిపివేశారు. కాగా స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ పి.వి. సెల్వకుమార్ చైన్నె హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుణ్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విప్ ధిక్కరించిన సభ్యులను పార్టీయే క్షమించి అంగీకరించినప్పుడు, వారు పార్టీ సభ్యులుగానే కొనసాగుతారని పేర్కొన్నారు. నియమాల ప్రకారం 15 రోజుల్లో క్షమాపణను ఆమోదించి అనర్హత పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారని, దాన్ని స్పీకర్ కూడా ఆమోదించారని గుర్తు చేస్తూ ఇందులో ఎలాంటి పొరపాటు లేదని వివరించారు. ఇది పార్టీకి, వారి సభ్యులకు సంబంధించిన అంశమని, మూడో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టారు.
హైకోర్టు


