తమిళసినిమా: సంగీత దర్శకుడిగా శతకప్రయాణం చేసిన జివీ. ప్రకాష్ కుమార్, కథానాయకుడిగానూ వరుసగా చిత్రాలు నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆయన తాజాగా వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడుగా పేరుగాంచిన శీను రామస్వామి దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇడిముళక్కమ్ అనే టైటిల్ ని నిర్ణయించారు. స్కై మాన్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్‌పై కలైమగన్ ముబారక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటి గాయత్రి శంకర్ నాయకిగా నటిస్తున్న ఇందులో శరణ్య పొన్వన్నన్,సౌందరరాజా, యోగిబాబు, బాబా భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనికి అశోక రాజా ఛాయాగ్రహణం, ఎన్ ఆర్.రఘునందన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఇది తమిళనాడులోని దక్షిణాది జిల్లాల నేపథ్యంలో రూపొందుతున్న పగ ,ప్రతీకారం ఇతివత్తంతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కథాచిత్రంగా ఉంటుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ చిత్రంలోని రెండు ఎనర్జిక్ ఐటెం సాంగ్స్‌తో కూడిన లిరికల్ వీడియోను ఆదివారం విడుదల చేసినట్లు చెప్పారని పేర్కొన్నారు. అందులో ఒకటి వైరమత్తు రాసిన గానా విళక్కు మయిలే అనే పల్లవితో సాగే పాట, వావరదన్ రాసిన అండి తేదీని సందైయిల్ అనే పల్లవితో సాగే పాట చోటు చేసుకున్నాయని చెప్పారు. ఈ లిరికల్ వీడియోలు సోనీ సంస్థ విడుదల చేసినట్లు చెప్పారు. కాగా జీవీ ప్రకాష్ కుమార్, దర్శకుడు శ్రీను రామసామిల రేర్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ ఇడిముళక్కమ్ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


