చైన్నెలో పలు చోట్ల ఆందోళనలు
నేడు తరగతుల బహిష్కరణకు
విద్యార్థి సంఘాల పిలుపు
ప్రజాస్వామ్య హక్కులపై దాడి
శాంతియుతంగా పోరాటం చేస్తున్న యువతకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన దాడి అని టీవీకే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం తీవ్రంగా ఖండించదగినదిగా పేర్కొన్నారు. యువత చేపట్టిన శాంతియుత పోరాటానికి మద్దతు తెలిపిన రాహుల్ గాంధీని పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే విఘాతంగా పేర్కొన్నారు. కాగా నీట్ పరీక్షను రద్దు చేయాలంటే విద్యను తిరిగి రాష్ట్ర జాబితాలోకి తీసుకురావాలని, లేకుంటే, ఈ సమస్యకు పరిష్కారం లభించదదని విద్యా శాఖ మంత్రి రాజ్ మోహన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో విద్యార్థులపై పోలీసుల అరెస్టుల పర్వం గురించి ప్రశ్నించగా, ‘‘రోడ్డు అనేది ఆందోళనలు చేయడానికి సరైన వేదిక కాదని,రాత్రి వేళల్లో పనులన్నీ ముగించుకుని ఇళ్లకు వెళ్లేవారికి ఇబ్బంది కలగకూడదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, నిర్ణీత పద్ధతిలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు.
ఎగ్మూర్‌లో విద్యార్థుల ఆందోళన
సాక్షి, చైన్నె : ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీకి వ్యతిరేకంగా, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ చైన్నెలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు, యువజన సంఘాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళనకు దిగాయి. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు.
రాజరత్నం స్టేడియం వద్ద ఉత్కంఠ
ఎగ్మోర్‌లోని రాజరత్నం స్టేడియం సమీపంలో నిరసన తెలిపేందుకు ఉదయం నుంచే విద్యార్థులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే అక్కడ నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతించాలని విద్యార్థులు కోరినప్పటికీ, పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో, పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లి సిద్ధంగా ఉంచిన బస్సుల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నీట్ రద్దే అన్ని సమస్యలకూ శాశ్వత పరిష్కారం
‘నీట్ పరీక్షను రద్దు చేయడమే అన్ని సమస్యలకూ శాశ్వత పరిష్కారంగా మారుతుందని డిఎంకె అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిందన్నారు. నీట్ పరీక్ష పూర్తిగా అక్రమాలు, అక్రమ పద్ధతుల కోసమే రూపొందించబడిందని మొదటిసారిగా హెచ్చరించింది తామేనని వివరించారు. అందుకే ఈ పరీక్ష ప్రవేశపెట్టిన నాటి నుంచే నీట్ వలన కలిగే నష్టాలను వివరిస్తూ డిఎంకె దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు గుర్తుచేశారు.
విద్యార్థుల అరెస్టు
రాష్ట్రవ్యాప్తంగా నీట్ రద్దుకు నిరసనలు
తిరువొత్తియూర్ పోలీస్ స్టేషన్ ముట్టడి
తిరువొత్తియూర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమీపంలో నిరసన తెలిపిన విద్యార్థులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని సమీపంలోని కళ్యాణ మండపానికి తరలించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి విద్యార్థులు కాలడిపేటలోని తిరువొత్తియూర్ పోలీస్ స్టేషన్‌న్‌ను అకస్మాత్తుగా ముట్టడించారు. అరెస్ట్ చేసిన తమ సహచరులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేయడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చైన్నెలో పలు చోట్ల నిరసనలు సాగగా, పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని అనుమతి కోరినప్పటికీ పోలీసులు నిరాకరించడాన్ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రు ఖండించారు. చైన్నె ప్రెసిడెన్సీ కాలేజీ, టీ నగర్ పరిసరాల్లో ధర్నాలు హోరెత్తాయి. టీ నగర్‌లోని సీపీఐ కార్యాలయం ఆవరణలో విద్యార్థులు బైటాయించి నిరసనకొనసాగిస్తున్నారు. ఈ నిరసనకు డీఎంకే మద్దతు ప్రకటించింది. చైన్నెలోని ప్రభుత్వ కళాశాలల వద్ద సాయంత్రం విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. కాగా గురువారం విద్యార్థులందరూ తరగతుల బహిష్కరణ నినాదంతో ఆందోళనలను ఉధృతం చేయడానికి విద్యార్థి సంఘాల సమ్మేళనం పిలుపు నిచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని కళాశాలల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.


