101 అడుగుల ఎత్తులో మెట్రో వంతెన | - | Sakshi
Sakshi News home page

101 అడుగుల ఎత్తులో మెట్రో వంతెన

Jul 23 2026 1:54 AM | Updated on Jul 23 2026 1:54 AM

తుది దశకు నిర్మాణం

గిండి కత్తిపారా వద్ద ఏర్పాటు

సాక్షి, చైన్నె : చైన్నె మెట్రో రైల్‌ రెండవ దశ ప్రాజెక్టులో భాగంగా అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్‌ అద్భుతం రూపుదిద్దుకుంటోంది. గిండిలోని కత్తిపారా జంక్షన్‌ వద్ద భూమికి 101 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ మెట్రో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. చైన్నెలో రెండు మార్గాలలో ప్రస్తుతం రైలు సేవలు జరుగుతున్నాయి. మరో మూడు మార్గాలలో పనులను శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో మాధవరం డెయిరీ ఫామ్‌ నుండి షోళింగనల్లూర్‌ వరకు 47 కిలోమీటర్ల రైల్వే కారిడార్‌ మొత్తం 46 స్టేషన్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ మార్గంలో చైన్నె నగరంలో ప్రధాన ప్రాంతంగా ఉన్న కత్తిపారా వంతెన బటర్‌ ఫ్‌లై వంతెన వద్ద 101 అడుగుల ఎత్తు 1,354 అడుగుల పొడవుతో, 410 అడుగుల వ్యాసార్థం కలిగిన పదునైన వంపుతో మెట్రో వంతెన మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో ఇప్పటికే 400కు పైగా పిల్లర్లను ఏర్పాటు చేసి గిర్డర్లను అనుసంధానించే పనులు పూర్తి చేస్తున్నారు.

అత్యంత సంక్లిష్టమైన సాంకేతికత

కత్తిపారా జంక్షన్‌ వద్ద ఇప్పటికే అనేక రోడ్లు, ఫ్లైఓవర్లు , భూగర్భ సొరంగాలు ఉండటం వలన సాధారణ పద్ధతిలో గిర్డర్లను అమర్చడం సాధ్యం కాలేదు. దీని కోసం బ్యాలెన్స్‌డ్‌ కాంటిలివర్‌ బ్రిడ్జ్‌ మెథడ్‌ అనే అత్యంత ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. పదునైన వంపులు, అత్యధిక ఎత్తు ఉన్న ప్రాంతాల్లో వంతెనలు నిర్మించడానికి ఈ పద్ధతి అనువైనదిగా చెప్పవచ్చు. భూమికి 101 అడుగుల ఎత్తులో ఆరు భారీ స్తంభాలను అనుసంధానిస్తూ, ఫార్మ్‌ ట్రావెలర్‌ పరికరం ద్వారా ఏకకాలంలో 110 టన్నుల బరువుగల నిర్మాణ సామగ్రిని తరలిస్తూ ఈ సవాలుతో కూడిన పనిని పూర్తి చేశారు. కత్తిపారా ప్రాంతంలో గత 18 నెలలుగా సాగుతున్న ఈ అనుసంధాన ఫ్లైఓవర్‌ పనులు పూర్తి కావచ్చాయి. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ఈ మార్గంలో ప్రయాణికుల కోసం మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించనున్నట్లు చైన్నె మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు పేర్కొంటున్నారు.

భారీ వంతెన పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement