బియ్యం ధరలకు రెక్కలు | - | Sakshi
Sakshi News home page

బియ్యం ధరలకు రెక్కలు

Jul 23 2026 1:54 AM | Updated on Jul 23 2026 1:54 AM

● సామాన్య ప్రజలకు షాక్‌ ● పక్షం రోజుల్లో కిలోకు రూ. 30 వరకు ధర పెరుగుదల

సాక్షి, చైన్నె: తమిళనాడులో కేవలం 15 రోజుల వ్యవధిలోనే బియ్యం ధరలు రెండోసారి భారీగా పెరిగాయి. తాజా పెంపుతో పొన్ని బియ్యం ధర కిలో రూ. 80కి, ఇడ్లీ బియ్యం ధర రూ. 50కి చేరింది. ఈ నిరంతర ధరల పెరుగుదలతో సామాన్య, నిరుపేద, మధ్య తరగతి వర్గాల నెత్తిన అదనపు భారం పడ్డట్లయ్యింది. తమిళనాడు వార్షిక బియ్యం అవసరం 91 లక్షల టన్నులు. అందులో స్థానిక రైతులు 75 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిన అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలపై ఆధారపడుతున్నారు. తమిళనాడులో కర్ణాటక పొన్ని రకానికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. అయితే ఈసారి అక్కడ నుండి దిగుమతులు తీవ్రంగా దెబ్బతినడంతో, స్థానిక వ్యాపారులు తమిళనాడులో పండే జాతీయ పొన్ని రకాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు.

పెరిగిన రవాణా ఖర్చులు

డీజిల్‌ ధరలు పెరగడం, రవాణా (ట్రాన్స్‌పోర్ట్‌) ఛార్జీలు అధికమవ్వడం కూడా ధరల మంటకు కారణమైంది.ఽ వివిధ రకాల బియ్యం రకం నెల క్రితం ఉన్న ధర కంటే, తాజాగా కిలోకు రూ. 30 వరకు పెరిగింది. ఇందులో 15 రోజులలో రెండు సార్లు ధర పెరగడం గమనార్హం. కర్ణాటక పొన్ని కిలోకు గత నెల రోజులలో రూ. 55 – రూ 65కు పెరిగి, తాజాగా రూ 80 వద్ద ఆగింది. ఇడ్లీ బియ్యం రూ. 35 నుంచి రూ. 40కు పెరిగి, తాజాగా రూ. 50 వద్ద ధర ఉంది. పొన్ని బియ్యం 25 కేజీల బస్తా ధర రూ. 350 నుండి రూ. 500 వరకు పెరిగినట్లు హోల్‌సేల్‌, రిటైల్‌ డీలర్లు తెలిపారు. ఇది చిల్లర వర్తకం వద్దకు చేరే కొద్ది కిలోకు అదనంగా రూ.2 నుంచి రూ. 5 వరకు ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పడే ధరలకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది తమిళనాడులో కరువై వరి సాగు నీళ్లు లేక కరిగిన నేపథ్యంలో రానున్న కాలంలో ఈ ధర రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే,కర్ణాటకలో కూడా నైరుతీ ఈ ఏడాది కరుణించనినేపథ్యంలో అక్కడి నుంచి దిగుమతి అన్నది మరింతగా తగ్గే ప్రమాదం ఉందని వర్తకలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనకరం: అన్బుమణి రామదాస్‌

మార్కెట్‌లో బియ్యం లభ్యతను పెంచి ధరలను తగ్గించేందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని పీఎంకే అధ్యుడు అన్బుమణి రాందాసు డిమాండ్‌చేశారు. తమిళనాడులో 15 రోజుల క్రితం కిలో బియ్యం ధర రూ. 15 వరకు పెరగ్గా, ఇప్పుడు మళ్లీ కిలోకు రూ. 3 నుండి రూ. 15 వరకు పెంచారని వివరించారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే తినే బియ్యం ధర కిలోకు రూ. 30 వరకు పెరగడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నదన్నారు. వర్షాలు పడకపోవడం వలన డెల్టా , కావేరి తీర ప్రాంతాల్లో సాగు తగ్గిందని చెబుతున్న కారణాన్ని తాము అంగీకరించలేమన్నారు. గత ఏడాది కురువై, సంబా, తాళడి పంటలు బాగా పండాయని, ప్రస్తుత సీజన్‌ కూడా ఇంకా పూర్తి కాలేదన్నారు. రాబోయే నెలల్లో బియ్యం రాక తగ్గుతుందనే ముందస్తు అంచనాతో వ్యాపారులు కృత్రిమంగా ధరలను పెంచారని రైతులు భావిస్తున్నారన్నారు. బియ్యం ధరలను అదుపు చేయడానికి బియ్యం ఎగుమతులపై తక్షణమే కేంద్రం నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. హోల్‌సేల్‌ వ్యాపారుల వద్ద ఉన్న బియ్యం నిల్వలపై పరిమితి విధించాలని, వీటి ద్వారా మార్కెట్లో బియ్యం సరఫరా పెంచి ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతుగా ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలని, . తమిళనాడులోని రైస్‌ మిల్లులు, హోల్‌సేల్‌ వ్యాపారుల వద్ద ఉన్న బియ్యంలో 20 శాతాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, రేషన్‌ షాపులు , సహకార విక్రయ కేంద్రాల ద్వారా తక్కువ ధరకు ప్రజలకు విక్రయించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement