సాక్షి, చైన్నె : చైన్నె సెంట్రల్ – గుమ్మిడిపూండి విద్యుత్ రైలు మార్గంలో సాంకేతిక లోపాలు, సిగ్నల్ సమస్యలు , ట్రాక్‌ల కొరత కారణంగా ప్రతిరోజూ ఎలక్ట్రిక్ రైళ్లు(ఈఎంయూ) 45 నిమిషాల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్నిసార్లు గంటల తరబడి సర్వీసులు నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే, ఈ సమస్య పూర్తిగా పరిష్కారమవ్వడానికి మరో రెండేళ్లు పడుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సమస్యకు ప్రధాన కారణాలు: చైన్నె నుండి చెంగల్పట్టు వరకు 3 ట్రాక్‌లు, అరక్కోణం వరకు 4 ట్రాక్‌లు ఉన్నాయి.ఈదృష్ట్యా ఈ మార్గాల్లో ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ రైళ్లు వేగంగా రాక పోకలు జరుగుతున్నాయి. అయితే, సెంట్రల్ – గుమ్మిడిపూండి మార్గంలో కేవలం 2 ట్రాక్‌లు మాత్రమే ఉన్నాయి. వీటిపైనే ఈఎంయూ (ఎలక్ట్రిక్), ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లను నడుపుతున్నారు. ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లకు ప్రాధాన్యత ఇస్తూ, బేసిన్ బ్రిడ్జ్, తిరువొత్తియూర్, మీంజూర్, ఎన్నూర్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ రైళ్లను గంటల తరబడి నిలిపివేస్తున్నారు.అలాగే, అనేక సందర్బాలలో సిగ్నల్ వైఫల్యాలు, ఓవర్ హెడ్ విద్యుత్ వైర్లు తెగిపోవడం, రైలు ఇంజన్లలో లోపాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ ఒక్క నెలలోనే ఇలాంటివి 7కి పైగా ఘటనలు జరిగి ఉండటం గమనార్హం. ఈ దృష్ట్యా, నగరంలోకి వివిధ పనుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం వచ్చేప్రయాణీకులు గంటల తరబడి నిరీక్షించక తప్పడం లేదు. అనేక సందర్భాలలో ఇదేం నరకం అన్నట్టుగా పరిస్థితి మారుతున్నది. సకాలంలో గమ్యస్థానాలకు వె ళ్లే పరిస్థితులు లేక పోవడంతో తీవ్ర అసహనాన్ని రైల్వేయంత్రాంగంపై వ్యక్తం చేస్తున్నారు.
రూ. 368 కోట్లతో కొత్తలైన్లు
సెంట్రల్ నుండి అత్తి పట్టు వరకు ఇప్పటికే 4 లైన్లు ఉన్నాయి. అత్తిపట్టు నుండి గుమ్మిడిపూండి వరకు ఉన్న 22 కిలోమీటర్ల దూరానికి 3వ , 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వే బోర్డు రూ. 368.42 కోట్ల నిధులను మంజూరు చేసింది.ఈ పనుల కోసం ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయని, అదనపు ట్రాక్‌ల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుందని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. ఆ తర్వాతే గుమ్మిడిపూండి మార్గంలో రైళ్ల రాకపోకలు సజావుగా సాగుతాయని చెబుతున్నారు.
ఎలక్ట్రిక్ రైలు సేవలు


