సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్.పి.వేలుమణిపై నమోదైన రూ. 98 కోట్ల టెండర్ల అవకతవకల కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై విచారణ జరిపేందుకు అనుమతి కోరే నివేదికలను దాదాపు 5 నెలలుగా పెండింగ్‌లో ఉంచడంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు అప్పటి సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారిణి రీటా హరీష్ థాక్కర్ వర్చువల్ ద్వారా కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
కేసు నేపథ్యం
అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చైన్నె, కోయంబత్తూరు కార్పొరేషన్లలో రూ. 98.25 కోట్ల విలువైన టెండర్లలో అక్రమాలు జరిగాయని అరప్పోర్ ఇయక్కమ్ కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిని జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ విచారణ చేపట్టారు.
ఐఏఎస్ అధికారుల అనుమతిలో జాప్యం
ఈ కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై విచారణ జరిపేందుకు అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయగా, కేంద్రం కొన్ని వివరణలు కోరింది. దానికి సంబంధించిన వివరాలను అవినీతి నిరోధక శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 27నే సాధారణ పరిపాలనా శాఖకు పంపినట్లు కోర్టుకు నివేదించింది.
5 నెలల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం
ఫిబ్రవరి 27 నుండి ఇప్పటివరకు (సుమారు 5 నెలలుగా) ఆ దస్త్రాలను పబ్లిక్ సెక్రటరీ ఎందుకు పెండింగ్‌లో ఉంచారో అర్థం కావడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అప్పటి సెక్రటరీ రీటా హరీష్ థాక్కర్ దీనిపై ప్రత్యక్షంగా వివరణ ఇవ్వాలని, అలాగే ప్రస్తుత పబ్లిక్ సెక్రటరీ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు
ఈ వ్యవహారంలో శాసనసభ ఎన్నికలు, ప్రభుత్వ మార్పు వంటి కారణాలను కోర్టు అంగీకరించదని, ఒక మాజీ మంత్రి , అధికారులపై ఉన్న అవినీతి కేసులో నిందితులను కాపాడేందుకు వ్యవస్థలు ప్రయత్నించడం నిజంగా దురదృష్టకరం. హైకోర్టు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఫైళ్లను తొక్కిపెట్టడం, కేసు పురోగతి లేకపోవడం ఆందోళనకరం అని న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేశారు.
హైకోర్టు


