తిరువొత్తియూరు: చైన్నె గోపాల్‌పురం ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల మహిళా లాయర్ గా పని చేస్తున్నారు. ఈమె ఆలందూర్‌లోని ఒక స్టార్ హోటల్‌కు రాత్రి సమయంలో తన స్నేహితులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో, అక్కడ డానన్స్ చేస్తూ ఉన్న ఇద్దరు యువకులు అకస్మాత్తుగా ఆ మహిళా లాయర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. దీనిపై పరంగిమలై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘర్షణకు సంబంధించి కోడంబాక్కం ప్రాంతానికి చెందిన ఇంజనీర్ అజిత్, తిరుచ్చికి చెందిన ఆన్‌లైన్ ట్రేడర్ ప్రశాంత్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా మప్పేడు ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులకు రహస్య సమా చారం అందింది. దీంతో తక్షణం మప్పేడు ప్రాంతంలో తనిఖీలను ముమ్మరం చేయాలని ఎస్పీ సాయి ప్రణీత్ ఆదేశాలు జారీ చేశారు. అనుమానస్పదంగా సంచరిస్తున్న ఒడిశాకు చెందిన బబ్లూ ప్రధాన్(24) అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇతను గంజాయినీ రైలులో తరలించి యువతే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు నిర్ధారించి అతడ్ని అరెస్టు చేశారు. అతడి నుంచి ఏడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
అన్నానగర్: చైన్నె, కన్నగి నగర్‌కి చెందిన రాజు అనే కబడ్డీ కోచ్ ఒక బాలిక పై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణల పై ఫిర్యాదు నమోదైంది. దీని తర్వాత, బాధితురాలి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు చెమ్మన్‌చేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు చేసిన మహిళ, కోచ్ తన కుమార్తెను లైంగికంగా వేధించినట్లు ఆధారాలు కూడా అందించింది. కోచ్ వాట్సాప్‌లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఆమె పేర్కొంది. దీంతో పోక్సో చట్టం కింద రాజు పై కేసు నమోదైంది. దీంతో కోచ్ రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రాజు కొడైకనాల్‌లో దాక్కున్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని బుధవారం రాజుని అరెస్టు చేశారు. అతను ఇంకా చాలా మందిని లైంగికంగా వేధించినట్లు తెలిసింది. అయితే బాధితురాలు తన తల్లి కోరడం వల్లే కోచ్‌పై ఫిర్యాదు చేసినట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
తిరువొత్తియూరు: చైన్నె కోటూరుపురం చిత్రానగర్‌కు చెందిన మురుగన్(45) టైల్స్ వేసే కూలీ పనులు చేస్తుండేవాడు. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన మురుగన్ రోజూ మద్యం సేవించడం అలవాటు. 45 రోజుల క్రితం కోటూరుపురం సూర్యా నగర్‌లోని టాస్మాక్ దుకాణానికి మద్యం కొనడానికి వెళ్లాడు. ఆ సమయంలో వీధి కుక్క మురుగన్ ఎడమ కాలుపై గట్టిగా కరిచి గాయం చేసింది.అయితే మురుగన్ ఆ గాయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, మద్యం కొనుగోలు చేసి సేవించాడు. ఈ క్రమంలో కుక్క కరిచిన చోట గాయం మరింత పెద్దదైంది. రేబిస్ సోకడంతో మంగళవారం మురుగన్ సైదాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మురుగన్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి మరణించాడు. కోటూరుపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
తిరువళ్లూరు: రెండేళ్ల పాటు ప్రేమించి ఆతర్వాత పెళ్లికి యువకుడు నిరాకరించిన క్రమంలో ఓ ప్రైవేటు వైద్యశాల నర్సు ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జేజే నగర్ ప్రాంతానికి చెందిన దేవరాజ్ కుమార్తె జయలక్ష్మి(23). ఈమే నర్సుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో జయలక్ష్మి తిరువేలాంగాడు ప్రాంతానికి చెందిన యువకుడిని రెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వివాహం చేసుకుంటానని నమ్మించి పలుసార్లు దగ్గరైనట్లు తెలిసింది. అయితే గత కొద్ది రోజుల నుంచి యువకుడు జయలక్ష్మికి దూరంగా వుండడంతో పాటూ వేరే యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు సమాచారం. దీంతో జయలక్ష్మి తనను పెళ్లిచేసుకోవాలని ఘర్షణ పడింది. బుధవారం మరోసారి ఫోన్‌లో తననూ పెళ్లి చేసుకోవాలని కోరగా యువకుడు నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఉరికి వేలాడుతున్న యువతిని కిందకు దింపి వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.


