సాక్షి, చైన్నె: మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం కేరళ ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాల్సిందిగాఆ రాష్ట్ర హోం మంత్రి రమేష్ చెన్నితాల తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌ని కోరారు. బుధవారం చైన్నె సచివాలయంలో విజయ్‌తో కేరళ హోం మంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సరిహద్దుల్లో డ్రగ్స్ రవాణా అడ్డుకట్టతో పాటు యువతలో అవగాహన కల్పించే అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఆపరేషన్ ధూపన ప్రాజెక్టుకు తమిళనాడు సహకారం అందించే విధంగా ముందుకు సాగారు. కేరళలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రారంభించిన ఆపరేషన్ ధూపన ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందించాలని సీఎం విజయ్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి తగిన హామీ ఇచ్చారు.
సరిహద్దుల వద్ద నిఘా:
కేరళ–తమిళనాడు సరిహద్దుల గుండా సాగుతున్న డ్రగ్స్ రవాణాను నిరోధించడానికి ఇరు రాష్ట్రాల అధికారుల శ్రేణులు సమన్వయంతో కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కేరళలో డ్రగ్స్‌కు సంబంధించి ఇప్పటికే 5,500 కేసులు నమోదు కాగా, 100 మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్లు హోం మంత్రి వెల్లడించారు.
ఆగస్టులో సీఎం విజయ్ కేరళ పర్యటన
పాఠశాల విద్యార్థులు, యువత ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నందున, వారిలో చైతన్యం తెచ్చేందుకు కేరళ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించనుందన్నారు. ఇందులో పాల్గొనాల్సిందిగా సీఎం విజయ్‌ను కేరళ ప్రభుత్వం తరఫున రమేష్ చెన్నితాల ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించిన విజయ్ ఆగస్టు నెలలో కేరళలో పర్యటించనున్నారు. ఈ అవగాహన ప్రచారంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా పాల్గొననున్నారు.


