ఉత్తర చైన్నె అభివృద్దికి గండం
సాక్షి, చైన్నె : రాజధాని నగరం చైన్నె మూడు భాగాలుగా విభజించబడి ఉంది. ఇందులో ఉత్తర చైన్నె, సెంట్రల్ చైన్నె, దక్షిణ చైన్నెలు ఉన్నాయి. వీటిలో ఉత్తర చైన్నె అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఒకప్పుడు రాజకీయ వివాదాలు, దాదాగిరి, గుండా, రౌడీయిజంతో గడ గడ వణికిన ఈ ఉత్తర చైన్నె పరిసరాలు తాజాగా మారుతూ వస్తున్నాయి. అయినా ఇక్కడ ఇరుకై న రోడ్లు ట్రాఫిక్ కష్టాలకు ప్రధాన కారణాలుగా ఉంటూ వస్తున్నాయి. రోడ్ల విస్తరణతో పాటుగా మౌళిక సదుపాయాల కల్పన, బ్రహ్మాండ ప్రాజెక్టులతో ఇక్కడి ప్రజల జీవన స్థితిని మార్చేందుకు గత డీఎంకే ప్రభుత్వం బృహత్తరప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఉత్తర చైన్నె ప్రగతి పేరిట అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
నిధుల మళ్లింపు – పెరిగిన ప్రాజెక్టు వ్యయం
భవన నిర్మాణ అనుమతుల జారీ, మాస్టర్ ప్లాన్‌ల రూపకల్పన వంటి కీలక బాధ్యతలు చూసే చైన్నె మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ) ద్వారా గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల అభ్యర్థనల మేరకు ఉత్తర చైన్నె అభివృద్ధి ప్రాజెక్టుకు తొలుత చర్యలు తీసుకున్నారు. రూ. 1000 కోట్లను తొలుత ప్రకటించారు. ఆ తదుపరి క్రమంగా నిధులు పెంచుతూ వచ్చారు. తాజాగా సాగుతున్న ప్రాజెక్టులకు వ్యయాన్ని ఏకంగా రూ. 6,300 కోట్లకు పెంచారు.దీంతో నిర్మాణ వ్యయం సిఎండీఎకు భారంగా మారినట్లయ్యింది. సీఎండీఏ వద్ద భవిష్యత్తు అవసరాల కోసం రిజర్వ్‌లో ఉంచిన రూ. 3,900 కోట్ల నిధులను గత ప్రభుత్వ హయాంలోనే పూర్తిగా ఖాళీ చేసినట్లు సమాచారం. కొత్త టెండర్ల ద్వారా కాకుండా, భవన అనుమతుల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో నిధులు లేక పనులు ఆగి పరిస్థితి నెలకొని ఉంది. పూర్తి చేసిన పనులకు కూడా కాంట్రాక్టర్లు డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో సీఎండీఏ అధికారులు ఈ ప్రాజెక్టులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాసి ఉండటం వెలుగులోకి వచ్చింది. రూ. 200 కోట్ల మేరకు రుణాలుతీసుకొని కొన్ని కాంట్రాక్టులకు చెల్లింపులు సాగినా, పూర్తి స్థాయిలో అందించ లేని పరిస్థితిలలో ఆర్థిక సంక్షోభాన్ని సీఎండీఏ ఎదుర్కోక తప్పడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.ప్రస్తుతం నిధుల కొరత నేపథ్యంలో ఉత్తర చైన్నె అభివృద్ధికి గండం అన్నది నెలకొన్నట్లయ్యింది. ఏకంగా రూ. 4,500 కోట్ల మేరకు జరుగుతున్న పనులన్నీ ఎక్కడికక్కడ ఆగే పరిస్థితులు నెలకొనడం గమనార్హం. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, మరో వైపు ఉత్తర చైన్నె ప్రగతిని పక్కన పెట్టి, కేవలం పెరంబూరుపై తాజాగా దృష్టి పెట్టే దిశగా ప్రభుత్వం కార్యాచరణలో ఉండటంతో గత డీఎంకే ప్రాజెక్టులన్నీ మూలన పడే పరిస్థితి నెలకొని ఉంది.
పెరంబూరు వైపుగా నిధులు
సీఎం విజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పెరంబూరు నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా, తాజాగా ఉత్తర చైన్నె ప్రగతి ప్రాజెక్టులకు మంగళం పాడే పరిస్థితి ఏర్పడినట్టు ఓ అధికారి వ్యాఖ్యానించారు. పెరంబూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 1,013 కోట్ల మాస్టర్ ప్లాన్‌కు సీఎం విజయ్ ఆదేశాలు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మేరకు రాష్ట్రంలోని రానున్న నాలుగేళ్ల కాలంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే తన ఎమ్మెల్యే నియోజకవర్గం నిధి నుంచి రూ. 3 కోట్లను ఇక్కడ పనులకు విజయ్ కేటాయించి ఉన్నారు. కాగా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉత్తర చైన్నె పరిధిలోని కీలక అభివృద్ధి పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లే దిశగా చైన్నె కార్పొరేషన్‌తో కలిసి అడుగులు వేయడానికి సైతం ఓ కార్యచరణ సిద్ధం అవుతున్నట్టు సీఎండీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా,ఉత్తర చైన్నె ప్రగతి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రమొదలైందని మాజీమంత్రి , సీఎండీఏ మాజీ చైర్మన్ శేఖర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేత స్టాలిన్ కళల ప్రాజెక్టుకు మంగళం పాడే ప్రయత్నంచేస్తే పోరాటాలు భగ్గుమంటాయని హెచ్చరించారు.


