సాక్షి, చైన్నె : రాజకీయాలలో సాగుతున్న కొనుగోళ్ల పర్వానికి పూర్తిగా కడ్డుకట్టపడాలని, నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యేలను నిలదీసినప్పుడే ఈ ధోరణిలో మార్పు వస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం తెలిపారు. బుధవారం తమిళనాడు సీఎం ఎస్. జోసెఫ్ విజయ్ కలిసి రాష్ట్రంలోని పలు ప్రజా సమస్యలపై ఆయన వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల పార్టీల మార్పిడి, రాజీనామాలపై షణ్ముగం తీవ్రంగా స్పందించారు. ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే పదవులకు ఎందుకు రాజీనామా చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తేనే ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడతారన్నారు. బేరాలకు పాల్పడే వారిపై ప్రజల్లో ఆగ్రహం బయలు దేరాలని పిలుపు నిచ్చారు. ఇతర పార్టీలను చీల్చి తమ బలాన్ని పెంచుకునే బీజేపీ శైలి వేరని, ఇక్కడ అన్నాడీఎంకే అంతర్గత విభేదాల వలన ఆ పార్టీ నేతలు రాజీనామా చేసి టీవీకే చేరడాన్ని ఆ శైలితో ముడి పెట్ట లేమన్నారు. ఈ హెచ్చరికలు కేవలం ఒకరికే కాదని, డీఎంకే, టీవీకే సహా అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాబోయే ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై వామపక్షాలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. సీఎంతో భేటీలో సేలం తాగునీటి సరఫరా కాంట్రాక్ట్ రద్దు చేయాలని, భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, లాకప్ మరణాలను కట్టడి చేయాలని, పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం ఉద్యోగ భద్రత, క్రమబద్దీకరణ, వంటి అనేక డిమాండ్లు ఉంచామన్నారు. చివరగా ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ,తాము ఎట్టి పరిస్థితులలోనూ సంకీర్ణ ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


