సాక్షి, చైన్నె : పుదుచ్చేరిలో ఇటీవల సీజ్ చేసిన అంతర్జాతీయ నకిలీ మందుల తయారీ ముఠాకు సంబంధించిన కీలకమైన గోడౌన్ తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో బయటపడింది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ విభాగం, పోలీసులు జరిపిన ఈ సంయుక్త దాడుల్లో పలు కోట్ల రూపాయల విలువైన నకిలీ మందులు, వాటి తయారీకి ఉపయోగించే భారీ ముడిసరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైన్నె మాధవరం సమీపంలోని పెరియసెక్కాడ్ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ (40) అనే వ్యక్తి చైన్నెలో ఏబీఏ డ్రగ్స్ అండ్ ఫార్ములేషన్స్ అనే లైసెన్స్డ్ ఔషధ విక్రయ సంస్థను నడుపుతున్నారు. అయితే, ఇటీవల ఆయన కంపెనీ పేరుతో ఎలాంటి బిల్లులు, పత్రాలు లేకుండా ప్రీగాబలిన్–150 పేరిట ఫిట్స్ , నరాల నొప్పుల నివారణ మాత్రలు శ్రీలంకకు పడవ ద్వారా తరలించడానికి ప్రయత్నిస్తుండగా రామనాథపురం పోలీసులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న రాజ్‌కుమార్ ఆ మాత్రలను పరిశీలించి, అవి తన కంపెనీ పేరును వాడుకుని ఎవరో తయారు చేసిన నకిలీ మాత్రలని గుర్తించారు. దీనిపై తమిళనాడు క్యూ బ్రాంచ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, ఈ నకిలీ మాత్రల నెట్‌వర్క్ పుదుచ్చేరి కేంద్రంగా సాగుతున్నట్లు తేలింది.
భారీ నిల్వల సీజ్
పూత్తురై ప్రాంతం తమిళనాడు పరిధిలోకి రావడంతో, చైన్నెలోని డ్రగ్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్‌కు సమాచారం అందించారు. విల్లుపురం డ్రగ్ ఇనన్‌స్పెక్టర్ శైలజ నేతృత్వంలోని బృందం వెంటనే స్వామి సరోన్ గోడౌనన్‌పై మెరుపు దాడి చేసింది. ఈ సోదాల్లో ప్రీగాబలిన్–150 సహా దాదాపు 20 రకాల నకిలీ మందుల తయారీకి సంబంధించిన ముడిసరుకులను భారీగా స్వాధీనం చేసుకున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఈ ముఠా అక్రమాలపై తమిళనాడు పుదుచ్చేరి డ్రగ్ కంట్రోల్ అధికారులు కేసు నమోదు చేసి నిందితుల నెట్‌వర్క్‌పై మరింతంగా దర్యాప్తు చేస్తున్నారు.
గోడౌన్
పుదుచ్చేరి ఫ్యాక్టరీ సీజ్ – నిందితుడి అరెస్ట్
పోలీసుల సమాచారంతో పుదుచ్చేరి కురుమాంపేట్‌లోని మెడినోక్ హెల్త్‌కేర్ అనే సంస్థపై దాడులు జరపగా, అక్కడ నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఆ దాడుల్లో రూ. 3 లక్షల విలువైన నకిలీ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ తయారీకి సూత్రధారి అయిన షణ్ముగాపురానికి చెందిన ఫ్యాక్టరీ యజమాని ప్రభాకరన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, ఆ ఫ్యాక్టరీకి సీల్ వేశారు. తమిళనాడు పోలీసులు కురుమాంపేట్ ఫ్యాక్టరీ వద్ద నిఘా ఉంచిన సమయంలో, అక్కడికి ఒక అనుమానాస్పద వ్యాన్ వచ్చింది. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో ఆరు కార్టన్ బాక్సుల్లో దాదాపు 1.5 లక్షల ప్రీగాబలిన్–150’ నకిలీ మాత్రలు లభ్యమయ్యాయి. వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుంది. వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ నకిలీ మాత్రలను తమిళనాడు పరిధిలోకి వచ్చే పూత్తురై లోని ఒక సీక్రెట్ గోడౌన్ నుండి లోడ్ చేసుకుని వచ్చినట్లు అంగీకరించాడు. ఈ గోడౌన్ మెడినోక్ హెల్త్‌కేర్ యజమాని ప్రభాకరన్ స్వామిసామి సరోన్ అనే పేరుతో గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్నట్లు తేలింది.


