సాక్షి, చైన్నె : రాజధాని నగరం చైన్నె నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చైన్నె యూనిఫైడ్ ట్రానన్స్ పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అడుగులు వేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించడం వల్లే నగరంలో మౌలిక సదుపాయాల పనులు సాగుతున్నప్పుడు ట్రాఫిక్ జాంలు పెరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి నగరంలోని రవాణా , రహదారుల నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని (డేటాను) ఒకే గొడుగు కిందికి తీసుకురావడానికి అధికారులు సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సుమారు రూ. 146.7 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వివరాలు.. చైన్నె నగరంలో ట్రాఫిక్ సమస్యగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నా సాలై, కామరాజర్ సాలై, జీఎస్టీ రోడ్లు, పూందమల్లి హైరోడ్డు...ఇలా అనేక ప్రధాన మార్గాలలో నిత్యం వాహన దారులు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఉదయం , సాయంత్రం వేళలో అయితే, వాహనాలు బారులు తీరాల్సిందే. అదే సమయంలో నగరంలో సాగుతున్న మెట్రో పనులు ఓ వైపు, వంతెన మార్గాల పనులు మరో వైపు, కేబుల్ తవ్వకాలు అంటూ తరచూ సాగే పనులతో మరింతంగా ట్రాఫిక్ గండం వాహనదారులకు తప్పడం లేదు. తాజాగా ఇందుకు చెక్ పెట్టే దిశగా కొత్త ప్రయత్నాలతో కార్యచరణకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మెట్రో రైల్, ప్రభుత్వ రవాణా సంస్థ, చైన్నె మెట్రో వాటర్, ట్రాఫిక్ పోలీస్, విద్యుత్ బోర్డు సహా దాదాపు 31 ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న డేటాను ఏకీకృతం చేసి, ఒకే నెట్‌వర్క్ కిందకు తీసుకురానున్నారు. ఇందుకోసం ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ సమగ్ర నివేదికను రూపొందించింది.
సింగపూర్ నమూనాపై అధ్యయనం
ఈ అత్యాధునిక వ్యవస్థను రూపొందించేందుకు ముందు, ఉమ్టా అధికారులు సింగపూర్‌లో విజయవంతంగా నడుస్తున్న ఇలాంటి వ్యవస్థను వ్యక్తిగతంగా సందర్శించి, క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి వచ్చారు. ఈ నూతన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ 6 విభిన్న విభాగాల సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇందులో నగర రోడ్ల మ్యాప్‌లు, రహదారుల వివరాలు, భూగర్భ తాగునీరు, విద్యుత్ లైన్ల లే అవుట్లు, ప్రజారవాణా మార్గాలు తదితర కీలక అంశాలు ఉంటాయి.
ప్రయోజనాలు
ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా ఏదైనా ఒక శాఖ రోడ్డు తవ్వకాలు చేపట్టేటప్పుడు ఇతర శాఖలకు ఆటోమేటిక్‌గా సమాచారం వెళ్తుంది. దీనివల్ల శాఖల మధ్య ఉండే వివాదాలు తొలగిపోతాయి. అంతేకాకుండా, ట్రాఫిక్ పోలీసుల నుంచి అనుమతులను సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వేగంగా పొందవచ్చు. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ ప్రస్తుత ప్రభుత్వ శాఖల వ్యక్తిగత డేటాబేస్‌లను మార్చదు లేదా వాటికి నకలుగా వ్యవహరించదు. కేవలం ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని విభాగాల డేటాను అనుసంధానించే వారధిగా మాత్రమే పనిచేస్తుంది. ఈ పథకాన్ని తొలుత చైన్నెలోని కొన్ని ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి, ఆ తర్వాత నగరం మొత్తానికి విస్తరించనున్నారు. ఈ సమగ్ర నివేదిక తుది ముసాయిదాను వచ్చే వారం సమీక్ష కమిటీ చర్చించిన అనంతరం, తుది ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఉమ్టా అధికారులు వెల్లడించారు.


