తిరువళ్లూరు: మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళణిస్వామి తీసుకున్న నిర్ణయాలతో అన్నాడీఎంకే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని మంత్రి నిర్మల్‌కుమార్ విమర్శించారు. తిరువళ్లూరు జిల్లా పట్రపెరంబదూరులోని లా కళాశాలలో 2022–23లో డిగ్రీలు పూర్తీ చేసిన విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసే కార్యక్రమం బుధవారం కళాశాల ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ కయల్‌విళి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి నిర్మల్‌కుమార్ హాజరై 250 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రధానం చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మల్‌కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పట్ణానికి దూరంగా కళాశాలను నిర్మించడం, విద్యార్థులకు కనీస వసతులను కల్పించకపోవడం దారుణమన్నారు. ఇక ఇటీవల నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడైన ఖైదీ మృతి చెందిన వ్యవహరంలో జైలుగార్డును అరెస్టు చేసి చర్యలు తీసుకున్నామన్నారు. తాము ఎమ్మేల్యేలను కొనుగోలు చేస్తున్నట్టు అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళణిస్వామి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, తాము పిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదన్నారు. తమ అధినేత నాయకత్వ లక్షణాలపై నమ్మకంతోనే వస్తున్నారని, అలాంటి వారికి కూడా తాము న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరంతరం ఏర్పడుతున్న విద్యుత్ కోతలపై దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.


