సాక్షి, చైనె: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పళని అరుల్మిగు దండాయుధపాణి స్వామి దేవస్థానానికి చెందిన రూ. 100 కోట్ల విలువైన భూమిని ఒక ప్రైవేట్ వ్యక్తి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడాన్ని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీవ్రంగా తప్పుపట్టింది. సదరు వివాదాస్పద రిజిస్ట్రేషన్‌ను తక్షణమే రద్దు చేస్తూ బుధవారం న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. పళని దండాయుధపాణి స్వామి మఠానికి చెందిన అత్యంత విలువైన భూమిని ప్రైవేటుకు రిజిస్ట్రేషన్ చేయడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.ఈ స్థలాన్ని మంత్రి రమేష్ బంధువులు ఆక్రమించినట్టు ఆరోపణలురావడంతో ఆయన తీవ్రంగా ఖండించారు. ఆలయ యాజమాన్యాన్ని సంప్రదించకుండా ,వాస్తవాలను దాచిపెట్టి గతంలో కోర్టు ద్వారా ఏకపక్షంగా పొందిన ఉత్తర్వులను సవాలు చేస్తూ, పళని దేవస్థాన కార్యనిర్వహణాధికారి హైకోర్టు మదురై బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం జస్టిస్ కార్తికేయన్ , జస్టిస్ శక్తివేల్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం, దేవస్థానం తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పలు విషయాలను కోర్టు దృష్టికి తెచ్చారు. ఆలయ అధికారులను కేసులో ప్రతివాదులుగా చేర్చకుండా, సింగిల్ జడ్జిని తప్పుదోవ పట్టించి అనుకూల ఉత్తర్వులు పొందారని వివరించారు. కోర్టు ఆదేశాలు వచ్చినా, ఆలయ ఆస్తి కాబట్టి దీనిని రిజిస్ట్రేషన్ చేయవద్దని ఆలయ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ముందే లేఖ రాశారని, అయినప్పటికీ, ఆ భూమిని ఎలాగైనా రిజిస్ట్రేషన్ చేయాలని తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ సెలవుపై వెళ్ళిపోయారని పేర్కొన్నారు. ఆ తర్వాత తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించిన ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌ను మేనేజ్ చేసి, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని కోర్టు దృష్టికితీసుకొచ్చారు.
హైకోర్టు ఆగ్రహం – రద్దు
వాదనలు విన్న ధర్మాసనం ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తీర్పును వెలువరిస్తూ న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి భూములను రిజిస్ట్రేషన్ చేసే ముందు ఆలయ యంత్రాంగానికి నోటీసులు ఇచ్చి వారి అభిప్రాయాన్ని కోరడం ప్రాథమిక బాధ్యతగాపేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ ఆస్తిపై వివాదాలు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ సింగిల్ జడ్జి దృష్టికి తీసుకువెళ్లి ఉండాల్సిందిగా సూచించారు. ఈ నియమాలను పాటించకుండా, వాస్తవాలను దాచిపెట్టి సింగిల్ జడ్జిని తప్పుదోవ పట్టించి ఉత్తర్వులు పొందారన్నారు. న్యాయాన్ని అపహాస్యం చేస్తూ, ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వకుండా చేసిన సదరు పత్రాల రిజిస్ట్రేషన్ పూర్తిగా చెల్లదని కోర్టు ప్రకటించింది. అలాగే సింగిల్ జడ్జి ఇచ్చిన పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ ఈ అప్పీల్ పిటిషన్‌ను ముగిస్తున్నట్లు ధర్మాసనం తీర్పునిచ్చింది.


