నిళల్ పేరిట అమలు
సాక్షి, చైన్నె: వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధి, విద్యార్థులు, వలస కార్మికుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కోయంబత్తూరు(కోవై) జిల్లాలో ప్రజా భద్రతకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నా రు ల భద్రత, మాదకద్రవ్యాల రవాణా, అనుమానాస్పద చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా కోయంబత్తూరు జిల్లా పోలీసులు ప్రపథమంగా నిళల్ పేరిట ఒక ఒక వినూత్నమైన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ ప్రజా భద్రతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల నివారణలో ప్రజలను నేరుగా భాగస్వామ్యం చేయడం కోసం ఈ డిజిటల్ వేదికను రూపొందించారు.
10 వేలకు పైగా ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్స్
ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా సంచరించే 10 వేలకు పైగా ముఖ్యమైన ప్రదేశాలలో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. వీటిని విద్యాసంస్థలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలలో అందుబాటులో ఉంచారు.
ఎలా పనిచేస్తుంది?:
పౌరులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ చేసుకోకుండానే నేరుగా ‘నిళల్’ వేదికను ఉపయోగించవచ్చు. ఈ వేదిక ద్వారా ప్రజలు పోలీసులకు సమాచారం అందించడానికి లేదా అత్యవసర సహాయం పొందడానికి మూడు సులభమైన మార్గాలను కల్పించారు. ఆ మేరకు టైప్ చేయడం రాని వారు లేదా త్వరగా సమాచారం అందించాలనుకునే వారు వాయిస్ రికార్డ్ చేసి పంపవచ్చు. నేర ప్రాంతం లేదా అనుమానాస్పద వ్యక్తుల ఫోటోలతో పాటు చిన్న సమాచారాన్ని జత చేసి పంపవచ్చు. అత్యవసర, ప్రమాద సమయంలో లేదా తక్షణ పోలీస్ సహాయం కావాల్సినప్పుడు దీని ద్వారా నేరుగా అధికారులను సంప్రదించవచ్చు.
వంద శాతం గోప్యత
‘నిళల్’ వేదికను పౌరుల వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ డిజైన్ చేశారు. సాధారణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి భయపడే వారు లేదా తమ వివరాలు బయటకు వస్తాయేమోనని ఆందోళన చెందేవారు ఎలాంటి భయం లేకుండా సమాచారం అందించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప, మిగిలిన సమయాల్లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు (పేరు, ఫోన్ నంబర్) ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ఈ వినూత్న సాంకేతికత ద్వారా కోయంబత్తూరు జిల్లాలో కొన్ని కీలక మార్పులు వస్తాయని పోలీసులు ఆశిస్తున్నారు. ఈ మేరకు అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ పోలీసులు త్వరితగతిన ఘటనా స్థలానికి చేరుకుంటారు. కాలేజీలు, పారిశ్రామిక ప్రాంతాల వద్ద జరిగే మాదకద్రవ్యాల విక్రయాలపై ప్రజల నుంచి ముందస్తు సమాచారం అందుతుంది. పోలీసులు, ప్రజల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి ప్రతి పౌరుడిని ఒక ఇన్ఫార్మర్‌గా మార్చడానికి ఇది దోహదపడుతుంది. ప్రతి పౌరుడు తన గుర్తింపును వెల్లడించకుండా సురక్షితంగా కోయంబత్తూరును క్రైమ్–ఫ్రీ జిల్లాగా మార్చడంలో భాగస్వామి కావాలని జిల్లా పోలీస్ యంత్రాంగం పిలుపునిచ్చింది.


