చైన్నె పోర్ట్–మధురవాయల్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్
2029 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
కిలాంబాకం నుంచి మరో ప్రాజెక్టు
నేషనల్ హైవే అథారిటీ వెల్లడి
చైన్నె నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైన్నె పోర్ట్ – మధురవాయల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే (ఫ్లయింగ్ రోడ్) ప్రాజెక్టును మార్చి 2029 నాటికి పూర్తి చేయాలని భారత జాతీయ రహదారుల అథారిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పనులను మరింత వేగవంతం చేసినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
సాక్షి చైన్నె: చైన్నె రేవు పట్టణానికి రవాణా సౌకర్యాన్ని సులభతరం చేసేందుకు 2009లో అప్పటి డీఎంకే ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును మొదట ప్రతిపాదించారు. అయితే ఆ తర్వాత తమిళనాడులో ప్రభుత్వం మారడంతో, జయలలిత నేతత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఈ పనులను నిలిపివేసింది. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత, 2021లో డీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు డిజైన్లలో కొన్ని కీలక మార్పులు చేసి, పనులను పునఃప్రారంభించారు. ప్రస్తుతం కూవం నది వెంబడి 15.5 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
వర్షాకాలంలో పనులు బంద్
ప్రస్తుతానికి చింతాత్రిపేట వరకు భారీ పిల్లర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. మొత్తంగా ప్రాజెక్టుకు సంబంధించిన 22 శాతం పనులు ముగిశాయని ఎనన్‌హెచ్‌ఏఐ తెలిపింది. అయితే చైన్నెలో వర్షాకాలం ప్రభావం ఎక్కువగా ఉండే సెప్టెంబర్ నుండి జనవరి వరకు కూవం నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణ పనులను చేపట్టబోమని అధికారులు స్పష్టం చేశారు.
రూ. 3,186 కోట్లతో కిలాంబాక్కం
– చెంగల్పట్టు ఫ్లైఓవర్
మరోవైపు, కిలాంబాక్కం సమీపం నుండి మహీంద్రా సిటీ (చెంగల్పట్టు) వరకు రూ. 3,186 కోట్ల అంచనా వ్యయంతో సరికొత్త ఫ్లైఓవర్ నిర్మించేందుకు వీలుగా డీపీఆర్ సిద్ధం చేసినట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. ఈ సరికొత్త ఫ్లైఓవర్‌ను చైన్నె మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టుతో అనుసంధానించేందుకు (ఇంటిగ్రేట్ చేయడానికి) అవసరమైన అధ్యయనాలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. దీనితో పాటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,098 కోట్ల వ్యయంతో చెంగల్పట్టు – తిండివనం జాతీయ రహదారిని 6–లేన్ల రహదారిగా అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదనను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే చైన్నె, దాని పరిసర ప్రాంతాల రవాణా ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.


