సాక్షి చైన్నె: సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. దిండిగల్ జిల్లా పళనిలోని ప్రముఖ ‘దండపాణి స్వామి మఠం’ ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు రూ.100 కోట్ల విలువైన 1.40 ఎకరాల ఆలయ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట అక్రమంగా రిజిస్టర్ చేయడంపై భక్తులు, దేవస్థానం అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. పళని కొండ దిగువన పూంగా రోడ్డులో ఉన్న ఈ స్థలాన్ని గతంలో పళని మురుగన్ ఆలయానికి వచ్చే భక్తుల వసతి, అన్నదానం కోసం ఉపయోగించేవారు. అయితే కాలక్రమేణా ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణకు గురైంది. దీనిపై పళని దేవస్థానం సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం, పళని మురుగన్ ఆలయ జాయింట్ కమిషనర్‌ను ఈ మఠానికి తక్కార్‌గా నియమించి, భూమిని దేవస్థానానికి అప్పగించారు. దీంతో, ఆలయ జాయింట్ కమిషనర్ మారిముత్తు నేతృత్వంలో సుమారు 60 ఏళ్ల తర్వాత.. గత ఏడాది ఈ రూ.100 కోట్ల భూమిని ఆక్రమణల నుండి విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో మురుగన్ భక్తుల కోసం ఉచిత వాహన పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించారు.
ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం:
పరిస్థితి ఇలా ఉండగా, ఈ నెల 2వ తేదీన పళని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బదిలీపై వెళ్లారు. ఆ స్థానంలో అదనపు బాధ్యతలు (ఇన్‌ఛార్జ్) స్వీకరించిన మరో సబ్ రిజిస్ట్రార్‌ను అడ్డుపెట్టుకుని, కొందరు ప్రైవేట్ వ్యక్తులు జూలై 6వ తేదీన ఈ మఠం భూమిని గుట్టుచప్పుడు కాకుండా తమ పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ మోసం ఆదివారం వెలుగులోకి రావడంతో పళని ఆలయ జాయింట్ కమిషనర్ మారిముత్తు వెంటనే స్పందించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, డిప్యూటీ ఐజీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లకు అత్యవసర నివేదికలు పంపారు. పళని ఆలయ అధికారులకు తెలియకుండానే ఈ రిజిస్ట్రేషన్ సాగి ఉండడం స్థానికంగా కలకలం రేపింది.


