సాక్షి, చైన్నె: మామిడి పండు గుర్తు వివాదంలో అన్బుమణికి ‘కామన్ సింబల్’ ఇవ్వాలన్న రామ దాస్ విన్నపాన్ని మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. పీఎంకేలో తలెత్తిన అంతర్గత విభేదాల నేపథ్యంలో మామిడి పండు గుర్తు విషయంలో దాఖలైన పిటిషన్‌న్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్బుమణి రామదాస్ వర్గానికి మామిడి పండు గుర్తుకు బదులుగా వేరే ఏదైనా సాధారణ గుర్తు కేటాయించాలన్న డాక్టర్ రామదాస్ తరఫు వాదనను కోర్టు పరిగణించలేదు.
రాందాస్ వర్గం వాదన
అన్బుమణిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించామని, ఆయన తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్నికల కమిషన్ వద్ద మామిడి పండు గుర్తును పొందారని రామదాస్ తరఫు న్యాయవాదులు వాదించారు. పార్టీ ఎవరికి చెందుతుందనే వివాదం తేలే వరకు ఆ గుర్తును ఎవరికీ కేటాయించకుండా స్తంభింపజేయాలని కోరారు. అదే సమయంలో ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉందని, నామినేషన్ల పరిశీలన కూడా ముగిసిందని జస్టిస్ టి.వి.తమిళసెల్వి పేర్కొన్నారు. ఈ తరుణంలో గుర్తును నిలిపివేస్తే అది పీఎంకే పార్టీకే నష్టం కలిగిస్తుందని వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల కమిషన్ వివరణ
పీఎంకే ప్రస్తుతం రిజిస్టర్డ్ పార్టీ మాత్రమేనని, గుర్తింపు పొందిన పార్టీ కాదని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపింది. మామిడి పండు గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉందని, గతంలో ఆ పార్టీకి ఆ గుర్తు ఉన్నందున ప్రాధాన్యత క్రమంలో దానిని కేటాయించామని వివరించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. అదే సమయంలో అన్బుమణి వర్గం వాదనలో ఎన్నికల ప్రక్రియ సగం ముగిసిందని, బస్సు ఎప్పుడో బయలుదేరిందని, ఇప్పుడు దానిని ఆపడం సాధ్యం కాదని వివరించారు. అన్బుమణి రామదాస్ వర్గానికి మామిడి పండు గుర్తును కేటాయించవద్దని ఎన్నికల కమిషన్‌న్‌ను ఆదేశించాలని రామదాస్ తరఫు న్యాయవాదులు పట్టుబట్టినప్పటికీ, అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. రెండు రోజుల పాటు సాగిన విచారణలో చివరకు రామదాసు విజ్ఞప్తిని తిరస్కరిస్తూ , ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చారు. దీంతో ప్రస్తుతానికి అన్బుమణి వర్గం పోటీ చేసే స్థానాల్లో ‘మామిడి పండు’ గుర్తు వాకునేందుకు అడ్డంకులు తొలగినట్లైంది.


