చమురు సంక్షోభం! | - | Sakshi
Sakshi News home page

చమురు సంక్షోభం!

Mar 13 2026 7:59 AM | Updated on Mar 13 2026 7:59 AM

పెట్రోల్‌ బంకుల ముందుబారులు

వాహనాల కిటకిట

నో స్టాక్‌ బోర్డులతో పరుగులు

వదంతులు నమ్మోద్దని అధికారుల వివరణ

వీడని గ్యాస్‌ కష్టాలు

రాష్ట్రంలో..

గ్యాస్‌ కష్టాల తరహాలో పెట్రోల్‌, డీజీల్‌ వంటి చమురు సంక్షోభం రాష్ట్రంలో నెలకొందనే సమాచారంతో వాహనదారులందరూ

బంకుల ముందు క్యూకట్టారు. కిలో మీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. కొన్ని బంక్‌లలో నో స్టాక్‌ అని బోర్డు పెట్టడంతో కలవరం

రెట్టింపు అయింది. అదే సమయంలో

సీఎం స్టాలిన్‌ ప్రజలకు భరోసా

ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

పెట్రోల్‌ బంక్‌ల వద్ద బారులుదీరిన వాహనదారులు

సాక్షి,చైన్నె : ఇరాన్‌ – అమెరికా, ఇజ్రయెల్‌ దాడులు, పశ్చిమ ఆసియా దేశాలలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో గత మూడు రోజులుగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లు, ఎల్‌పీజీ గ్యాస్‌ కష్టాలు రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నాయి. దీంతో హోటల్‌ యజమానులు, ఆటో, కార్లు వంటి క్యాబ్స్‌ యాజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చిన్న చిన్నహోటళ్లు ఇప్పటికే మూత పడాయి. పెద్ద హోటళ్లు సైతం తాము కూడా అదే బాటలో పయనించక తప్పదన్నట్టుగా హెచ్చరికలు చేశాయి. ఫుడ్‌ మెనూను తగ్గించేశాయి. ధరలను పెంచేశాయి. ఈ పరిస్థితులలో గురువారం తిరుచ్చిలో పర్యటించిన పీఎం మోదీ సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ఆందోళన వద్దని, అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, వదంతులు నమ్మోద్దని భరోసా ఇచ్చి వెళ్లారు. ఆదిశగా గ్యాస్‌ ఉత్పత్తి పెంపుతో పాటుగా వంటగ్యాస్‌ సిలిండర్లు ఇళ్లకు, హాస్టళ్లకు, ఆసుపత్రులలో ఉపయోగించి గ్యాస్‌కు కొరత రాకుండా విస్తృతంగా చర్యలు, జాగ్రత్తలు చేపట్టారు. ఈ పరిస్థితులో రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడినట్టుగా వెలువడ్డ సమాచారం ఉత్కంఠ కలిగించింది.

ఆందోళనలో వాహనదారులు

చమురు సంక్షోభం సమాచారంతో చాలా చోట్ల పెట్రోల్‌ బంకుల వద్ద కిలోమీటర్ల మేరకు వాహనాలు బారులుదీరాయి. ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహన దారులు ఫుల్‌ట్యాంక్‌ నింపే పనిలో పడ్డారు. కొన్ని చోట్ల అయితే, క్యాన్లలో సైతం పెట్రోల్‌ నింపుకెళ్లారు. 25 లీటర్ల వాటర్‌ క్యాన్లు తాజాగా పెట్రోల్‌ క్యాన్లుగా మారినట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. వాణిజ్య అవసరాల కోసం వాడే ఎల్‌పీజీ సిలిండర్ల కొరత తరహాలో ఇకపై పెట్రోల్‌, డీజిల్‌ కూడా దొరకదన్న ఆందోళనతో కూడిన సమాచారాలు దావానంలా వ్యాపించాయి. దీంతో రాష్ట్రంలోని చైన్నెతో పాటుగా ఇతర నగరాలు, పట్టణాలలోని అన్నిపెట్రోల్‌ బంక్‌ల వద్ద వాహన దారులు బారులుదీరడంతో ఉత్కంఠ నెలకొంది. చైన్నెలో ఉదయాన్నే ఏ పెట్రోల్‌ బంక్‌లో చూసిన రద్దీగా మారింది. శివారులలో కొన్నిచోట్ల స్టాక్‌ రాక పోవడంతో నో స్టాక్‌బోర్డులు దర్శనం ఇచ్చాయి. దీంతో మరింత కలవరంలో ఎక్కడ పెట్రోల్‌ లభిస్తున్నదో అన్న ఆందోళనతో వాహనదారులు పరుగులు తీయాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ నెలకొంది.

ప్రభుత్వం అప్రమత్తం

అన్నీ వదంతులే..

ఈ పరిస్థితిపై భారత్‌ పెట్రోలియం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌లోని హార్మూజ్‌ జలసంధి మూసివేత కారణంగా భారత్‌కు చమురు సరఫరా ఆగిపోతుందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆందోళన వద్దని సూచించారు. భారత్‌ కేవలం హార్మూజ్‌ జలసంధిపైనే ఆధారపడటం లేదని, ఇతర మార్గాల ద్వారా కూడా చమురు దిగుమతి అవుతోందని వివరించారు. గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని భరోసా ఇచ్చారు.

పెట్రోల్‌ బంకుల వద్ద వాహన దారుల బారుల నేపథ్యంలో సీఎం ఎం.కె. స్టాలిన్‌ స్పందించారు. తక్షణం అన్ని పెట్రోల్‌ బంకుల వద్ద పోలీసుల భద్రతా విధుల్లోకి దిగాలని ఆదేశించారు. వాహన దారులు దూసుకెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ వ్యవహారంపై సీఎం స్పందిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చమురు సరఫరాను క్రమబద్ధీకరించాలని కోరినట్టు పేర్కొన్నారు. పెట్రోల్‌ బంకుల వద్ద రద్దీని నియంత్రించాలని, వదంతులు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. గ్యాస్‌, చమురు సంవృద్ధిగా లభించే విధంగా చర్యలు చేపట్టామని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసి ఉన్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాజా పరిస్థితుల నేపథ్యంలో చీఫ్‌ సెక్రెటరీ మురుగానందం నేతృత్వంలో సచివాలయంలో అధికారులు సమావేశమయ్యారు. అన్ని జిల్లాలో పెట్రోల్‌ బంకులలో చమురు నిల్వలు, గ్యాస్‌ డీలర్ల వద్ద సిలిండర్ల నిల్వ, తదితర అంశాల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య ఎదురు కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, బ్లాక్‌ మార్కెటింగ్‌పై కొరడా ఝుళిపించాలని సీఎస్‌ ఆదేశించారు. ఇదిలా ఉండగా చైన్నెలోని కొన్ని శ్మశాన వాటికలకు వాణిజ్య సిలిండర్ల కొరత కష్టాలను సృష్టిస్తోంది. మృతదేహాల దహనానికి గ్యాస్‌ తప్పనిసరి కావడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇక, కట్టె పొయ్యలు, కట్టెల అమ్మకాలు, విద్యుత్‌ స్టౌవ్‌ల కొనుగోళ్లు తాజాగా పెరిగాయి. ఇక, గ్యాస్‌ సిలిండర్ల కోసం వినియోగ దారులు డీలర్ల వద్దకు పరుగులు తీసినా ఫలితం శూన్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement