●కార్మికుడికి ఉరిశిక్ష విధించిన పోక్సో కోర్టు
తిరువొత్తియూరు: ముగ్గురు బాలికలపై లైంగిక దాడి చేసిన కేసులో నైల్లె కోర్టు నిందితుడుకి ఉరి శిక్ష విధించింది. వివరాలు.. మేలపాళయం కురిచ్చి సమీపంలో అళగిరిపురం ప్రాంతానికి చెందిన ఆనంద్ శేఖర్ ( 41) కార్మికుడు. అతనికి పెళ్లయి 3 ఏళ్ల పాప ఉంది. అతను గత 2023లో 6, 7, 8 సంవత్సరాల వయస్సున్న ముగ్గురు బాలికలను బెదిరించి ఇంటి లోకి తీసుకెళ్లి ఒకే సమయంలో లైంగిక దాడి చేశాడు. ఈ దారుణ సంఘటన గురించి ఎవరికై నా చెబితే చంపేస్తానని ఆనంద్ శేఖర్ ఆ బాలికలను బెదిరించాడు. దీంతో భయపడిన బాలికల దైనందిన కార్యకలాపాలలో చాలా మార్పు కనిపించింది. తర్వాత విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, పాళై మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఆనంద్ శేఖర్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఈ కేసు విచారణ నైల్లె జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టులో జరిగింది. తుది విచారణ తర్వాత న్యాయమూర్తి సురేష్ కుమార్ గురువారం నిందితుడు ఆనంద్ శేఖర్‌కు ఉరిశిక్ష విధించింది. బాధితులైన ముగ్గురు బాలికలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.7 లక్షలు పరిహారంగా అందించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రభుత్వ తరపున లాయర్ ఉష వాదించారు.
ఢిల్లీకి పుదుచ్చేరి పంచాయితీ
సాక్షి,చైన్నె : పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలు ఢీల్లీకి చేరారు. సీట్ల పంచాయతీలో ఢిల్లీ పెద్దల ద్వారా డీఎంకే అధిష్టానం పై ఒత్తిడి తెచ్చే పనిలోపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరిలోనూ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సీట్ల పంపకాల చర్చలు మొదలయ్యాయి. తమిళనాడులో కూటమికి ఏ విధంగా డీఎంకే పెద్దన్నగా ఉందో, అదేవిధంగా పుదుచ్చేరిలో కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని అక్కడి నేతలు ప్రకటించారు.అయితే, పుదుచ్చేరిలోని డీఎంకే నేతలు దీనిని అంగీకరించడం లేదు. 30 స్థానాలలో తమకు 18 స్థానాలు ఇవ్వాలని లేకుంటే, సగానికి సగం పంచుకుని పోటీ చేస్తామన్నట్టుగా నినాదాన్ని అందుకున్నారు. ఇందుకు కాంగ్రెస్ తమిళనాడు,పుదుచ్చేరి ఇన్‌చార్జ్ గిరిశ్ చోదన్కర్‌తోపాటుగా ఇతరనేతలు అంగీకరించడం లేదు. దీంతో సీట్ల పంపకాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. ఈ పరిస్థితులలోమాజీ సీఎంలు నారాయణస్వామి, వైద్యలింగం తదితర కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ పెద్దల ద్వారా తమిళనాడులో ఉన్నడీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌తో సంప్రదింపునకు సన్నద్ధమయ్యారు. స్టాలిన్‌పై తమ పెద్దలద్వారా ఒత్తిడి తెచ్చి పుదుచ్చేరిలో అధిక స్థానాల కై వసం దిశగా కాంగ్రెస్ నేతలు వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. అయితే, పుదుచ్చేరి వ్యవహారాలన్నీ డీఎంకే సీనియర్ నేత, ఎంపీ జగద్రక్షకన్ పర్యవేక్షిస్తుండటం గమనార్హం. ఆయన నిర్ణయానికి అనుగుణంగానే స్టాలిన్ సైతం పుదుచ్చేరి వ్యవహారాలలో తలదూర్చడం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ పరిణామాలు పుదుచ్చేరి కాంగ్రెస్, డీఎంకే కూటమిలో ఎ లాంటి ప్రకంపనలు రేపబోతున్నాయో వేచి చూడాల్సిందే.
రాష్ట్రంలో నేరాల తగ్గుముఖం
సాక్షి, చైన్నె: తమిళనాడులో గత ఐదేళ్లుగా ప్రధాన నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర హోం, ఎకై ్సజ్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్ వెల్లడించారు. గురువారం చైన్నెలోని సచివాలయంలో డీజీపీ జి. వెంకట్రామన్, చైన్నె పోలీస్ కమిషనర్ ఎ. అరుణ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేరాల పరిస్థితిపై తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు వాస్తవ గణాంకాలను ప్రజల ముందు ఉంచుతున్నామని వివరించారు. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. హత్యలు, దోపిడీలు, మహిళలపై అఘాయిత్యాలు వంటి ప్రధాన నేరాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోందని ఆయన వివరించారు. 2021లో రాష్ట్రవ్యాప్తంగా 1,597 హత్య కేసులు నమోదు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య 1,490కి, 2025లో 1,461కి తగ్గిందన్నారు. లైంగిక దాడుల కేసులు 2021లో 422 కేసులు నమోదు కాగా, 2025 నాటికి అవి 401కి తగ్గాయని పేర్కొన్నారు. 2026 ప్రారంభంలో కూడా ఇదే విధమైన తగ్గుదల ధోరణి కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
చైతన్యం పెరగడం వల్లే ఫిర్యాదులు
ఈ సందర్భంగా డీజీపీ జి. వెంకట్రామన్ మాట్లాడుతూ.. గణాంకాల కంటే బాధితులకు న్యాయం చేయడమే తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. ముఖ్యంగా పోక్సో , ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహన వల్ల బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు.


