మోగనున్న ’విజయ్‌’ ఈల | - | Sakshi
Sakshi News home page

మోగనున్న ’విజయ్‌’ ఈల

Mar 13 2026 7:59 AM | Updated on Mar 13 2026 7:59 AM

సాక్షి,చైన్నె : తమిళనాడులో కుల గణన చేపట్టాలని, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ విజయ్‌ ఇచ్చిన పిలుపుతో తమిళనాడు వెట్రి కజగం నేతృత్వంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. చైన్నె కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో జరిగిన నిరసనకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌. బుస్సీ ఆనంద్‌ నేతృత్వం వహించారు.

కుల గణన – సామాజిక న్యాయం

ఈ సందర్భంగా ఆనంద్‌ మాట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి ఒక్కరికీ సమాన ప్రాతినిథ్యం దక్కాలంటే కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ అత్యవసరంగా పేర్కొన్నారు. పెరియార్‌ వారసులమని చెప్పుకునే డీఎంకే ప్రభుత్వం, సామాజిక న్యాయానికి విరుద్ధంగా కుల గణనను అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే దీనిపై జీవో జారీ చేయాలి‘ అని డిమాండ్‌ చేశారు.

శాంతిభద్రతల వైఫల్యం

రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్ల చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, అడయార్‌లో విద్యార్థినిపై జరిగిన దాడి, తూత్తుకుడిలో జరిగిన హత్య ఘటనలను దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి నేరాల్లో సగం మంది అధికార పార్టీకి చెందిన వారే ఉంటున్నారని ఆరోపించారు. తమిళనాడును డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పిన పాలకులు, నేడు ప్రతి మూలనా మాదకద్రవ్యాలు దొరికేలా చేశారని మండిపడ్డారు.

2026 ఎన్నికలే లక్ష్యం

తమ పార్టీ అధినేత విజయ్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ప్రభుత్వం భయపడుతోందని ఆనంద్‌ అన్నారు. వచ్చే 50 రోజుల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారబోతున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు వెట్రి కజగం విజయం సాధించడం ఖాయమని, తమ నాయకుడు విజయ్‌ నేతృత్వంలో మహిళలకు 100 శాతం భద్రత, సామాజిక న్యాయం కలిగిన సుపరిపాలన దక్కబోతోందన్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఆనందంతో ఈలలు మోగుతాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ డిప్యూటీ కార్యదర్శి ఆదవ్‌ అర్జున తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement