క్లుప్తంగా
మంజా దారంతో ప్రమాదం
తిరువొత్తియూరు: చైన్నె కొరుక్కుపేట ప్రాంతానికి చెందిన ప్రకాష్ జైన్(67) ఇతను గత 6 సంవత్సరాలుగా చైన్నె మాధవరంలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం పని ముగించుకుని, మూలక్కాడై ఫ్లైఓవర్ మీదుగా బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు తెగిపడిన మంజా దారం అతని ముఖానికి తగిలి కోసుకుపోయింది. దీంతో ప్రకాష్ జైన్ ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో రక్తపు మడుగులో పడిపోయాడు. చుట్టుపక్కల వారు రక్షించి, అక్కడి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రకాష్‌జైన్ ముఖానికి కుట్లు వేసి, ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఒక వేళ అది మెడకు తగిలి ఉంటే, అతని ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది. ఇలాంటి చర్యలను పోలీసులు తక్షణమే అడ్డుకోవాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కొడుంగయ్యూరు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
ఫ్లైఓవర్ నుంచి
కిందపడిన కారు
–యువకుడికి తీవ్రగాయాలు
తిరువొత్తియూర్: వంతెన పైనుంచి కారు కిందపడి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చైన్నె కోడంబాక్కం, అండవర్ నగర్‌కు చెందిన సాధిక్‌బాషా కుమారుడు సల్మాన్ (19). ఇతను రాయపేటలోని ఒక ప్రైవేట్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సాయంత్రం తల్లితో చెప్పి అంబత్తూరులోని స్నేహితుడిని కలవడానికి లగ్జరీ కారులో వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో మధురవాయల్ బైపాస్ రోడ్డులో పోరూరు వైపు తిరిగి వెళుతున్నాడు. ఆ సమయంలో కారు అదుపుతప్పి మధురవాయిల్ 30 అడుగల ఫ్లైఓవర్ నుంచి కింద బోల్తాపడింది. ఈఘటనలో సల్మాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అటుగా వెళుతున్న వాహనదారులు తీవ్రంగా గాయపడిన సల్మాన్‌ను కారులో నుంచి బయటకు తీసి కీల్పాక్కం ఆస్పత్రికి తరలించారు. మధురవాయిల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంతృప్తి చెందేలా
రథసప్తమి ఏర్పాట్లు
–టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి
తిరుమల:తిరుమలలో ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న రథ సప్తమి వేడుకలకు భక్తుల సంతృప్తి చెందేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో రథ సప్తమికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లోని గ్యాలరీలు, అన్న ప్రసాదాల పంపిణీకి తీసుకుంటున్న చర్యలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎరచ్రందనం కేసులో
ఒకరికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎరచ్రందనం చెట్లను నరకడానికి ప్రయత్నించిన కేసులో తమిళనాడు, కృష్ణగిరి జిల్లాకు చెందిన మురుగన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషన్‌న్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక దళం సిబ్బంది 2017లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్ బీట్, చామల రేంజ్ అటవీ ప్రాంతంలో తనిఖీలు చేశారు. నిందితుడు మురుగన్ అటవీ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించడాన్ని ఫారెస్ట్ సిబ్బంది గుర్తించి, అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచారు. మురుగన్‌పై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
ఊంజల్ సేవలో అమ్మవారు
నారాయణవనం : పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పద్మావతీ అమ్మవారు ఊయల సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. పద్మావతీ అమ్మవారిని సుందరంగా అలంకరించి తిరుచ్చి వాహనంపై అధిష్టింపజేశారు.


