ట్రాపిక్ పోలీసులకు
పేపర్ గుజ్జు టోపీల పంపిణీ
తిరువళ్లూరు: వేసవి కాలంలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు పేపర్ గుజ్జు టోపీలను ఆవడి పోలీసు కమిషనర్ ప్రేమ్ ఆనంద్ సిన్హా మంగళవారం అందజేశారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి కమిషనరేట్ పరిధిలోని ట్రాపిక్ పోలీసులకు పేపర్‌గుజ్జు టోపీలు, పోలీసులు, వాహనచోదకులకు హెల్మెట్లు అందించి చలివేంద్రం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఆవడి పోలీసు కమిషనర్ ప్రేమ్‌ఆనంద్ సిన్హా హాజరయ్యారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పోలీసులు పాల్గొన్నారు.
వామపక్షాలతో మళ్లీ చర్చ
సాక్షి, చైన్నె: డీఎంకే కూటమిలో సీట్ల పంపకాల వేగం పెంచారు. సీపీఐ, సీపీఎంలతో రెండో విడతగా డీఎంకే కమిటీ మంగళవారం చర్చించిందిజ సీసీఎం నేత కె. బాలకృష్ణన్, వీర పాండియన్, సీపీఎం నేతలు షణ్ముగం తదితరులతో కూడిన ఈ కమిటీ ఈ చర్చలకు హాజరైంది. తమ పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాల జాబితాను వారు డీఎంకే కమిటీకి అందజేశారు. ఇక,వీసీకేతో చర్చలు ముగింపు దశలో ఉండడంతో సీట్ల పంపకాలు ఒకటిరెండురోజులలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎండీఎంకే నేత వైగో నేతృత్వంలో కమిటీ బుధవారం డీఎంకేతో చర్చించనుంది. ముందుగా పార్టీ వర్గాలతో సమావేశానికి వైగో నిర్ణయించారు.
పలు చోట్ల ఈడీ సోదాలు
సాక్షి, చైన్నె : మంగళవారం చైన్నెతో పాటూ రాష్ట్రంలో పలుచోట్ల ఈడీ సోదాలు జరిగాయి. పెట్టుబడుల పేరిట మోసాలకు పాల్పడిన సంస్థలను గురి పెట్టి ఈ తనిఖీలు చేపట్టారు. కొన్ని చోట్ల పొద్దుపోయే వరకు సోదాలు జరిగాయి. ఈ దాడులకు సంబంఽధించిన సమగ్ర వివరాలు తెలియాల్సి ఉంది.
మూడు బస్తాల
గంజాయి స్వాధీనం
తిరువళ్లూరు: ఆంధ్ర నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి మూడుబస్తాల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తిరువల్లూరు జిల్లా కారనోడై వద్ద పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.ఈ సమయంలో అనుమానస్పదంగా వచ్చిన మినీ లారీని ఆపి చూడగా అందులో మూడు బస్తాల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. నిందితుడు మాధవరం ప్రాంతానికి చెందిన చేపల వ్యాపారి కధిరవన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అక్క ఇంట్లో అర్ధరాత్రి..
– తమ్ముడు, భార్య, కుమార్తె
అనుమానాస్పద మృతి
అన్నానగర్: గుడువాంచేరిలోని అక్క ఇంట్లో ఉన్న తమ్ముడు, అతని భార్య, కుమార్తె మంటలో కాలి మరణించిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాలు.. పెరుమాట్టునల్లూర్ పంచాయతీ పరిధిలోని పాండూరు గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్న పార్థిబన్ (34). ఇతని భార్య చిత్ర (29). వీరి కుమార్తె జయశ్రీ (3). పార్థిబన్ రోజూ పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు. పార్తీబన్ పనికి వెళ్లినప్పుడు, ఇతను తన భార్య, బిడ్డను కన్నివాక్కమ్ జె.జె. నగర్ లోని తన అక్క మహేశ్వరి (37) ఇంట్లో వదిలి, పని తర్వాత, రాత్రి వారిద్దరిని తన ఇంటికి తీసుకువెళ్లేవాడు. ఈ స్థితిలో, సోమవారం రాత్రి, ఎప్పటిలాగే పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, పార్థిబన్ మద్యం సేవించి తన అక్క మహేశ్వరి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంతలో, మహేశ్వరి మూడవ కుమారుడు పవన్ కుమార్ అనారోగ్యం ఏర్పడటంతో తాంబరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వచ్చే వరకు ఇంట్లో ఉండమని మహేశ్వరి, ఆమె భర్త రామ్‌నాథ్ (45), మహేశ్వరి తండ్రి ముర్తి (63), తల్లి పుష్ప (56) ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స తర్వాత, అందరూ మంగళవారం తెల్లవారుజామున 1 గంటకి ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడు మహేశ్వరి ఇంటి నుండి పొగలు ఎగసి పడుతుండటం చూసి దిగ్భ్రాంతి తో కేకలు వేసింది. స్థానికుల సమాచారంతో మరైమలైనగర్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఇంటిలోపల పార్థిబన్, అతని భార్య చిత్ర, కుమార్తె జయశ్రీ పూర్తిగా కాలిపోయి కనిపించారు. సమాచారం అందుకున్న గుడువాంచెరి ఇన్‌స్పెక్టర్ నేడుమారన్, పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


