610 గ్రాములతో పుట్టిన శిశువుకు పునర్జన్మ | - | Sakshi
Sakshi News home page

610 గ్రాములతో పుట్టిన శిశువుకు పునర్జన్మ

Mar 11 2026 7:48 AM | Updated on Mar 11 2026 7:48 AM

సాక్షి, చైన్నె: చైన్నెలోని పెరుంబాక్కంలో ఉన్న గ్లెనెగల్స్‌ ఆసుపత్రి వైద్యులు అసాధారణ వైద్య ప్రతిభను కనబరిచారు. కేవలం 610 గ్రాముల బరువుతో, 25 వారాలకే జన్మించిన నవ జాత శిశువుకు 100 రోజులకు పైగా నిరంతర చికిత్స అందించి ప్రాణాపాయం నుండి కాపాడారు. చైన్నెకి చెందిన ఓ గర్భిణి తీవ్రమైన రక్తపోటు సమస్యతో బాధపడుతూ గ్లెనెగల్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ పద్మప్రియ వివేక్‌ను సంప్రదించారు. తల్లి ఆరోగ్యం క్షీణించడంతో పాటూ గర్భస్థ శిశువుకు రక్తప్రసరణలో ఆటంకాలు ఏర్పడటాన్ని గుర్తించిన వైద్యులు గత ఏడాది అక్టోబర్‌ 30వ తేదిన అత్యవసరంగా ఎల్‌ఎస్‌సీఎస్‌ సర్జరీ నిర్వహించారు. దీనివల్ల కేవలం 25 వారాలకే ఒక ఆడబిడ్డ జన్మించింది.

100 రోజుల పోరాటం..

పుట్టిన సమయంలో శిశువు బరువు చాలా తక్కువగా ఉండటంతో పాటూ ఊపిరితిత్తులు, గుండె సరిగ్గా అభివృద్ధి చెందక పోవడంతో శిశువును వెంటనే నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కి తరలించారు. శిశువుకు 10 రోజుల పాటు ఇన్వాసివ్‌ వెంటిలేషన్‌, ఆ తర్వాత రెండు నెలల పాటు నాన్‌–ఇన్వాసివ్‌ వెంటిలేషన్‌ ద్వారా శ్వాస అందించారు. జీర్ణవ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందక పోవడంతో, వైద్య బృందం చాలా జాగ్రత్తగా, క్రమపద్ధతిలో ఆహారాన్ని అందిస్తూ శిశువు బరువు పెరిగేలా చూశారు. 100 రోజుల పాటూ జరిగిన ఈ పోరాటంలో చిన్నారికి మెదడులో రక్తస్రావం , లేదా కంటి చూపు సమస్యలు తదితర ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కలగకుండా వైద్యులు జాగ్రత్త పడ్డారు. ఈ విజయంపై డాక్టర్‌ పద్మప్రియ వివేక్‌ మాట్లాడుతూ, తల్లి ఆరోగ్యం , శిశువు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాము తీసుకున్న వేగవంతమైన నిర్ణయం చిన్నారి ప్రాణాలను కాపాడింది అని తెలిపారు. సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ శ్రీల షెరిన్‌ పౌలియా మాట్లాడుతూ, శిశువు 41వ వారానికి చేరుకునే సరికి 1.8 కిలోల బరువుకు చేరుకుందన్నారు. ఎటువంటి ఆక్సిజన్‌ సపోర్ట్‌ లేకుండానే డిశ్చార్జ్‌ కావడం తమ నియోనాటాలజీ బృందం సాధించిన గొప్ప విజయం్ఙ అని పేర్కొన్నారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయిన ఈ చిన్నారి, ఇటీవల రెగ్యులర్‌ చెకప్‌ కోసం రాగా.. ప్రస్తుతం 2.15 కిలోల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. గ్లెనెగల్స్‌ ఆసుపత్రిలోని అత్యాధునిక ఎన్‌.ఐ.సి.యు సదుపాయాలు, మల్టీడిసిప్లినరీ విధానం వల్ల ఈ అసాధారణ విజయం సాధ్యమైందని ఆసుపత్రి సీఓఓ నిరంజని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement