డీఎంకేలోకి మాణిక్కరాజా
సాక్షి, చైన్నె: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఆపార్టీ నేత టీటీవీ సన్నిహితుడు మాణిక్కరాజా డీఎంకేలో చేరారు. శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకేను మళ్లీ ఏకం చేద్దామన్న నినాదంతో ముందుకెళ్తూ వచ్చిన టీటీవీ తాజాగా మళ్లీ ఎన్‌డీఏ పక్షాన చేరడంలో ఆపార్టీలో వ్యతిరేకత బయలుదేరింది. అనేక మంది నేతలు టీటీవీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీటీవి సన్నిహితుడైన డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మాణిక్క రాజా పార్టీని వీడేందుకు నిర్ణయించారు. మంత్రి గీతా జీవన్, ఎంపీ కనిమొళితో కలసి డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నాఅరివాలయంకు వచ్చారు. అక్కడ స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరారు. తూత్తుకుడి జిల్లాలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు కీలంగా ఉన్న మాణిక్కరాజా బయటకు వెళ్లడం ఆ పార్టీకి గట్టి దెబ్బగా మారింది. ఈ విషయంగా మాణిక్కరాజా మాట్లాడుతూ టీటీవీ దినకరన్ సైతం పళణిస్వామిలా నియంతంగా మారి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేలో అందరూ ఏకం కావాలన్న నినాదంతో ముందుకు సాగి, ఇప్పుడు స్వలాభం కోసం ఎన్‌డీఏతో చేతులు కలిపారని మండిపడ్డారు. మరెందరో ఆ పార్టీని వీడి డీఎంకేలో చేరబోతున్నట్టు ప్రకటించారు.


