రూ.3కోట్లతో మెట్రోపార్కు
– ప్రారంభించిన ఉదయనిధి
సాక్షి, చైన్నె: మెట్రో రైలు ప్రధాన కార్యాలయం ఆవరణలో రూ.3 కోట్లతో మెట్రో పార్కును ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. చైన్నె నందనంలో మెట్రో రైలు ప్రధాన కార్యాలయం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ 3750 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.3.50 కోట్ల వ్యయంతో మెట్రో పార్కు క్రీడా ప్రాంగణం నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ప్రజలు పార్కులో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పార్కును, క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో ఈ పార్కును డిప్యూటీ సీఎం ఉదయనిధి ప్రారంభించారు. అలాగే క్రీడా ప్రాంగణంలోని ఏర్పాట్లను పరిశీలించారు. కాసేపు ఆయన అక్కడి సిబ్బందితో కలిసి క్రీడలలో భాగస్వామ్యమయ్యారు. ఈ కార్యక్రమంలో మేయర్ ప్రియ, మెట్రో రైలు డైరెక్టర్ సిద్ధిక్, గ్రేటర్ చైన్నె కమిషనర్ కుమర గురుబరన్ తదితరులు పాల్గొన్నారు. మెట్రో రైలుకు సంబంధించి రైల్వే స్టేషన్, పరిసరాలలో ఖాళీగా స్థలం ఉంటే అక్కడ పార్కు రూపకల్పన దిశగా కార్పొరేషన్ వర్గాలు చర్యలు విస్తృతం చేయడానికి నిర్ణయించారు.


