ఓటు హక్కు వినియోగించుకోవాలి
వేలూరు: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లో విద్యార్థులకు ఓటు హక్కు వినియోగించడంపై అవగాహన, వివిధ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం, విద్యార్థులతో అవగాహన ర్యాలీ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికీ కులమతాలు తేడా లేకుండా ఓటు వేసే హక్కు ఉందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీ నుంచి ప్రతి తాలూకాలో అవగాహన కార్యక్రమాలు చేపడుతునట్లు తెలిపారు. ఓటు హక్కు వినియోగించడంపై గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు తెలియజేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఓటరు చేతిలోనే దేశంలోని ప్రధాన మంత్రిని, ముఖ్యమంత్రిని కాని, రాజకీయ నాయకులను ఎంత స్థాయికి చేయాలన్న కీలక ఆయుధం ఓటుతోనే ఉందన్నారు. ఓటు అనే ఆయుధంతో ఎంత స్థాయి రాజకీయ నాయకుడినైనా ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. నచ్చిన రాజకీయ నాయకులకు మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి దేశ భవిష్యత్‌ను కాపాడాల్సిన బాధ్యత యువత చేతిలోనే ఉందన్నారు. అనంతరం అవగాహన ర్యాలీని ప్రారంభించి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సీఈఓ ప్రేమలత, రెవెన్యూ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


