గాంధీ పేరు కొనసాగించాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

గాంధీ పేరు కొనసాగించాల్సిందే!

Jan 24 2026 7:48 AM | Updated on Jan 24 2026 7:48 AM

గాంధీ పేరు కొనసాగించాల్సిందే!

గాంధీ పేరు కొనసాగించాల్సిందే!

ఉపాధిలో పేరు కొనసాగాల్సిందే జీరామ్‌జీతో రాష్ట్రం నెత్తిన ఆర్థిక పిడుగు అసెంబ్లీలో తీర్మానం ప్రధానికి మోదీ సీఎం ప్రశ్నల వర్షం

సాక్షి, చైన్నె:ఉపాధి హామీ పథకానికి మహాత్మ గాంధీ పేరును తొలగిస్తూ కేంద్రం తీసుకున్న చర్యలను అసెంబ్లీలో తీవ్రంగా ఖండించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌, అజీవికామిషన్‌–గ్రామీణ(వీబీ–జీరామ్‌జీ)తో రాష్ట్రాల నెత్తిన ఆర్థిక భారం, నిధుల పిడుగు పడ్డట్టేనని సీఎం స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును కొనసాగించాలని తీర్మానం చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు శుక్రవారం జమ్ములో జరిగిన ప్రమాదంలో మరణించిన ఆర్మీ వీరులకు సభ్యులు సంతాపం తెలియజేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి శివశంకర్‌ మాట్లాడుతూ ఎలక్ట్రిక్‌ బస్సులు లాభాలతోనే నడుస్తున్నాయని వివరించారు. కన్యాకుమారిలోనూ పర్యాటక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్‌ మాట్లాడుతూ విద్యా నాణ్యత మెరుగు, కళాశాలలో మౌలిక వసతుల విస్తృతానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. మేట్టూరులోని జ్ఞాన దండపాణి ఆలయంలో రూ.2.38 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టామని మంత్రి శేఖర్‌బాబు ప్రకటించారు. కుమ్మర్ల జీవనోపాధి కల్పన దిశగా బంక మట్టి తవ్వకాలకు అనుమతి ఇస్తూ మంత్రి రాజకన్నప్పన్‌ వ్యాఖ్యలు చేశారు. మైలాడుతురైలో సామా జిక న్యాయ కళాశాలల హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మెయ్యనాథన్‌ తెలిపా రు. తిరువణ్ణామలైలో మినీ విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్‌ పిచ్చాండి ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు. పల్లావరం–పంబల్‌–కుండ్రత్తూరు మధ్య ఫోర్‌ వే పనులకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కరుణానిధి కోరారు. ఆరోగ్యశాఖా మంత్రి ఎం సుబ్రమణియన్‌ స్పందిస్తూ పేరావూరని ఆస్పత్రిలో రూ.5 కోట్లతో అదనపు వైద్య మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. 2002లో ఆర్‌సీహెచ్‌ ఉద్యోగులకు రూ.500 జీతం ఇస్తుండగా, తాజాగా రూ.27 వేల వరకు జీతం పొందుతున్నారని పేర్కొన్నారు. ఐదేళ్లలో 2 వేల కొత్త వైద్య భవనాలను ప్రారంభించామని వివరించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ మినీ స్టేడియంలను మరింత విస్తతం చేయనున్నామని ప్రకటించారు.

గాంధీ పేరుకు మద్దతుగా తీర్మానం

ప్రశ్నోత్తరాల అనంతరం సభలో సీఎం స్టాలిన్‌ ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. పేద, వెనుకబడిన, అణగారిన ప్రజలకు సామాజిక భద్రతగా ఉన్న ఈ పథకాన్ని కేంద్రం ప్రణాళిక బద్ధంగా నిర్వీర్యం చేయడానికి సన్నద్ధమైందని ధ్వజమెత్తారు. ప్రఽతి పక్ష నేత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తాజాగా వెళ్లారని గుర్తు చేస్తూ, ఈసందర్భంగా ఆయన ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతున్నాన ని వివరించారు. ఈ ప్రశ్నలన్నింటికి ప్రధాని నరేంద్రమోదీ ద్వారా సమాధానం ఇప్పిస్తారా అని సవా ల్‌ చేశారు. అనంతరం తమిళనాడు శాసనసభలో ఉపాధి హామీ చట్టం నిబద్ధత ప్రణాళికకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రతిపాదించింది, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ పథకానికి పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ, మహాత్మా గాంధీ పేరు కొనసాగించాల్సిందేనని తీర్మానం చేసి ఆమోదించారు. సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మోసపూరితంగానే ఈ పథకానికి పేరు మార్చిందని ధ్వజమెత్తారు. జీరామ్‌జీతో రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల విడుదల వెంటనే జరగదని, ఉద్దేశ పూర్వకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్రాల నెత్తిన ఆర్థిక, నిధుల భారం మోపేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. అనంతరం సభలో మంత్రి రాజేంద్రన్‌ ఓ ముసాయిదాను దాఖలు చేశారు. మహాబలిపురం, కన్యాకుమారి ప్రగతి లక్ష్యంగా ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. అలాగే బ్రాయిలర్‌ కోళ్ల పెంపకందారులకు సంబంధించి ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చారు. వారి ప్రయోజనాలే లక్ష్యంగా ఇందులో ముఖ్య అంశాలు పేర్కొన్నారు. అసెంబ్లీలో అన్బుమణి మద్దతు పీ ఎంకే ఎమ్మెల్యే సదాశివం, రాందాసు మద్దతు పీఎంకే ఎమ్మెల్యే జీకే మణి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో స్పీకర్‌ ఇద్దరికి క్లాస్‌ తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement