అధిక సీట్లు అడుగుదామా?
సాక్షి, చైన్నె: డీఎంకే నుంచి ఈసారి అధిక సీట్లు ఆశిద్దామా వద్దా అన్న దిశగా జిల్లాల కార్యదర్శుల అభిప్రాయ సేకరణలో ఎండీఎంకే నేత వైగో శుక్రవారం నిమగ్నమయ్యారు. ఎగ్మూర్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లాల కార్యదర్శుల సమావేశాన్ని వైగో నిర్వహించారు. ఇందులో పార్టీ ఎంపీ దురై వైగోతోపాటుగా ముఖ్య నేతలు పాల్గొన్నారు. 2021 ఎన్నికలలో ఎండీఎంకే ఆరు స్థానాలలో డీఎంకే కూటమిలో పోటీ చేసింది. ఇందులో రెండింట్లో మాత్రమే గెలిచారు. దీంతో పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు అన్నది కరువైంది. ఇటీవలి లోక్ సభ ఎన్నికలలో డీఎంకే కూటమి నుంచి తిరుచ్చిలో దురై వైగో గెలవడం ఆపార్టీకి కాస్త ఊరట కలిగినట్టైంది. ఈ సారి ఎన్నికల కమిషన్ గుర్తింపు పదిలం చేసుకోవడం లక్ష్యంగా ప్రత్యేక చిహ్నంలో పోటీ చేసే దిశగా వ్యూహాలకు వైగో పదును పెట్టారు. ఇందులో భాగంగా గత రెండు వారాలకు పైగా తిరుచ్చి నుంచి మదురై వరకు పాదయాత్రను సైతం నిర్వహించారు. తిరుచ్చి, పుదుకోట్టై, శివగంగై, మదురై జిల్లాలను గురి పెట్టి వైగో పర్యటన జరగడంతో అక్కడి అసెంబ్లీ నియోజకవర్గాలపై ఆ పార్టీ గురి పెట్టిందన్నది స్పష్టం అవుతోంది. ఈ పరిస్థితులలో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో ప్రత్యేక చిహ్నంతో పోటీ చేయడంపై చర్చించారు. డీఎంకేను ఈ సారి అధిక సీట్లు కోరాలని మెజారిటీ శాతం మంది నేతలు వైగోకు సూచించినట్టు సమాచారం. అయితే గత ఎన్నికలలో ఆరు స్థానాలలో రెండింట మాత్రమే గెలిచిన నేపథ్యంలో ఆశించిన సీట్లు డీఎంకే ఇచ్చేనా అన్న డైలమాలో వైగో ఉన్నట్టు సమాచారం. అయినా పార్టీ జిల్లాల కార్యదర్శుల సూచన మేరకు ఈ సారి రెండంకెల మేరకు సీట్లను డీఎంకే నుంచి ఆశించేందుకు సన్నద్ధమవుతూ ఈ సమావేశంలో నిర్ణయించినట్టు ఎండీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.
అధిక సీట్లు అడుగుదామా?


