డిమాండ్లన్నీ నెరవేరుస్తాం
అసెంబ్లీలో సీఎం స్టాలిన్
23 ఏళ్ల కలను సాకారం చేశామని ధీమా
కోళ్ల ఉత్పత్తి దారుల సమస్యలపై చర్చకు అన్నాడీఎంకే పట్టు
స్పీకర్ తిరస్కరణతో సభ నుంచి వాకౌట్
సాక్షి, చైన్నె : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, పౌష్టికాహార సిబ్బంది ఇలా అందరి డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వం విస్తృతంగా కసరత్తులు చేస్తున్నట్టు అసెంబ్లీ వేదికగా సీఎం స్టాలిన్ గురువారం ప్రకటించారు. పాత పెన్షన్ ప్రయోజనాలతో కొత్త పథకం అమల్లోకి తీసుకొచ్చి ఉద్యోగుల 23 ఏళ్ల కలను సాకారం చేశామని అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో మూడవ రోజు గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి కేఎన్ నెహ్రూ సమాధానం ఇచ్చారు. ఆ మేరకు ఊత్తుకోట పట్టణ పంచాయతీని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. చెంబరంబాక్కం రిజర్వాయర్ నీటిని ఆ పరిసర ప్రాంతాలకు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. చైన్నె, కోయంబత్తూరు, మదురైలలో రూ. 200 కోట్లతో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయించామన్నారు. మంత్రి స్వామినాథన్ మాట్లాడుతూ, నగరాలు, పట్టణాల పేర్లు ఇక తమిళంలో ఉచ్చరించేలా, ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. రాష్ట్రంలో 22 లక్షల మందికి తమ ప్రభుత్వం ఇంటి పట్టాలను మంజూరు చేసినట్లు మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ ప్రకటించారు. తమిళనాడులో 115 పర్యాటక హోటళ్లు ఉన్నట్టు మంత్రి ఏవీ వేలు పేర్కొన్నారు. రాష్ట్రంలోని జైళ్లలో 21,558 మంది ఖైదీలు ఉన్నట్టు మంత్రి రఘుపతి వివరించారు.
అన్నీ పరిష్కరిస్తున్నాం
సభలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం పోరాడటం వారి హక్కు అని పేర్కొంటూ, పార్ట్ టైం ఉపాధ్యాయులతో పలు మార్లు ప్రభుత్వం చర్చించిందని, సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎలా ఇచ్చేవారో ఓ మారు ప్రతి పక్షం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, పౌష్టికాహార సిబ్బంది అందరి సమస్యలు, డిమాండ్లు, కోరికలను పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. శుక్రవారం అసెంబ్లీలో గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం కీలక తీర్మానం ప్రవేశ పెట్టనున్నట్టు తెలిసింది.


