మోదీ సభతో మార్పు తథ్యం
సాక్షి, చైన్నె : ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ అధికార మార్పునకు వేదిక కానున్నట్టు కేంద్ర మంత్రి, బీజేపీ తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జ్ పీయూష్ గోయల్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగే బహిరంగ సభ ద్వారా కూటమి నేతలందరూ ఒకే వేదిక పైకి రానున్నారని ప్రకటించారు.
చైన్నెలో తిష్ట వేసి పీయూష్ గోయల్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను మళ్లీ ఎన్‌డీఏ కూటమిలోకి తీసుకొచ్చారు. తాజాగా గురువారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో విస్తృతంగా చర్చల్లో మునిగారు. సీట్ల పందేరం, నియోజకవర్గాల ఎంపిక కసరత్తులు ఇందులో జరిగినట్టు సమాచారం. బీజేపీ 30 స్థానాలు , ఇతర చిన్న పార్టీలు తలా ఓ స్థానం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తొమ్మిది, జీకే వాసన్ టీఎంసీ ఆరు లేదా ఏడు స్థానాలలో, అన్బుమణి పీఎంకే 15లోపు స్థానాలలో పోటీ చేసే దిశగా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను కూటమిలోకి ఆహ్వానించే విధంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, రాష్ట్ర వ్యవహారాల కో ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీనియర్ బీజేపీ నేత హెచ్ రాజా, పొన్ రాధాకృష్ణన్, అన్నాడీఎంకే నేతలు ఎస్పీ వేలుమణి, దిండుగల్ శ్రీనివాసన్, కేపీ మును స్వామి ఉన్నారు. పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ, డీఎంకేను ఓడిస్తాం. అధికారం చేజిక్కించుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లో తమిళనాట అధికార మార్పు తథ్యం అన్నారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలో ఉందని గుర్తు చేస్తూ, తమిళనాడులో పళణిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని వ్యాఖ్యలు చేశారు. పళణిస్వామి మాట్లాడుతూ శుక్రవారం జరిగే మోదీ బహిరంగ సభ తమిళనాడు రాజకీయాల్లో మార్పునకు వేదిక కానున్నదన్నారు. ఈ సభ 5లక్షల మందితో జరగనున్నట్టు వివరించారు. అనంతరం పీయూష్ గోయల్‌తో జీకే వాసన్, పుదియ నీది కట్చి నేత ఏసీ షణ్ముగం వేర్వేరుగా భేటీ అయ్యారు. అదే సమయంలో టీటీవీ దినకరన్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై మంతనాలలో మునగడం గమనార్హం. మాజీ సీఎం పన్నీరుసెల్వంను ఎన్‌డీఏ వైపు లాగేందుకే ఈ చర్చ జరిగినట్టు తెలిసింది.
బ్రహ్మాండ ఏర్పాట్లు
ప్రధాని నరేంద్రమోదీ సభకు చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో బ్రహ్మాండ ఏర్పాట్లు చేశారు. అన్నాడీఎంకే – బీజేపీ కూటమి నేతలందరూ ఒకే వేదికపైకి రానున్నారు. తమ కూటమిని మోదీ ఈ వేదికపై ప్రకటించనున్నారు. తిరువనంతపురం పర్యటనను ముగించుకుని చైన్నెకు వచ్చే మోదీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మధురాంతకం వెళ్లనున్నారు. ఆయన రాకతో చెంగల్పట్టు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఈ బహిరంగ సభ వేదికపై ఎంజీఆర్, జయలలిత చిత్రాల్లోని పాటలు, ప్రసంగాలను హోరెత్తించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉండడం విశేషం.


