చైన్నె వర్సిటీలో స్నాతకోత్సవం
● బహిష్కరించిన విద్యామంత్రి ● గవర్నర్ హాజరు
సాక్షి, చైన్నె : చైన్నె వర్సిటీ స్నాతకోత్సవాన్ని ఉన్నత విద్యాశాఖా మంత్రి కోవి చెలియన్ బహిష్కరించారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవి పాల్గొని విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యా సంస్థ చైన్నె వర్సిటీ 167వ స్నాతకోత్సవానికి చర్యలు గురువారం ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి గవర్నర్ ఆర్‌ఎన్ రవి అధ్యక్షత వహించారు. విద్యా శాఖ కార్యదర్శి శంకర్ స్వాగతోపన్యాసం చేశారు. శాస్త్ర వేత్త పద్మశ్రీ శివథాను పిల్‌లై స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖా మంత్రి కోవి చెలియన్ హాజరు కావాల్సి ఉంది. అయితే, తాను బహిష్కరిస్తున్నట్టు కార్యక్రమానికి ముందుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంలో గవర్నర్ తీరును ఖండిస్తూ తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. గవర్నర్ రవి చేతుల మీదుగా 1,323 మంది విద్యార్థులకు పతకాలను ప్రదానం చేశారు. ఇందులో 41 మందికి డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. ముగ్గురికి స్కాలర్ అవార్డును అందజేశారు. ఇక, ట్రాన్స్ జెండర్ జసిందాకు డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవం ద్వారా చైన్నె వర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలలలో చదువుకున్న 93 వేల మంది విద్యార్థులందరికి డిగ్రీలను అందజేశారు.
మాజీ ఎమ్మెల్యే యూటర్న్
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే హఠాత్తుగా యూ టర్న్ తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పెరంబలూరు జిల్లాకు చెందిన అన్నాడీఎంకే నేత, కున్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆర్‌టీ రామచంద్రన్ డీఎంకేలో చేరుతున్నట్టు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ను కలవనున్నట్టుగా ప్రకటించారు. అయితే, రాత్రికి రాత్రే నిర్ణయం మార్చేసుకుని ఏకంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు గురువారం వీడియో విడుదల చేశారు. తన కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా మందలించారని, అందుకే డీఎంకేలో చేరడం లేదని, ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం గమనార్హం.
28,29 తేదీల్లో సమ్మిట్
సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వం, నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ సహకారంతో, టిడ్కో మద్దతుతో ఇండియా గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026కు చర్యలు తీసుకున్నారు. ఈనెల 28, 29 తేదీల్లో కలైవానర్ అరంగం వేదికగా రెండు రోజుల పాటు శిఖరాగ్ర సమావేశం జరగనుంది. సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, విద్యామంత్రులు కోవి చెలియన్, అన్బిల్‌మహేశ్, పరిశ్రమల మంత్రి టీఆర్‌బీ రాజా, విద్యా వేత్తలు, నిపుణులు, హాజరు కానున్నారు. విద్య, విజ్ఞానం వంటి అంశాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, బిటూబీ ఎక్స్ పో, ఉన్నత విద్య నైపుణ్యం, పరిశోధనలు, ఆవిష్కరణల గురించి కీలక సమీక్షలు జరగనున్నాయి.
రష్యాలో ఉద్యోగాల పేరిట దగా
సాక్షి, చైన్నె: రష్యాలో ఉద్యోగం పేరిట 250 మంది వద్ద ఓ ప్రైవేటు సంస్థ మోసానికి పాల్పడింది. ఒక్కొక్కరి వద్ద రూ.4 లక్షలు వసూళ్లు చేసినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మదురైలో ఎస్‌ఎస్ కాలనీలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగం పేరిట ఇచ్చిన ప్రకటనలకు మదురై, తిరునల్వేలి, కన్యాకుమారిలతో పాటు కేరళకు చెందిన నిరుద్యోగులు విదేశీ ఉద్యోగం మోజుతో ఆ సంస్థను ఆశ్రయించారు. ఒక్కొక్కరి వద్ద రూ.4 లక్షలు వసూళ్లు చేసిన ఈ సంస్థ నిర్వాహకులు పత్తాలేకుండా పోయారు. తమ పాస్‌పోర్టులు, తమ సర్టిఫికెట్లతో సైతం ఈ నిర్వాహకులు కనిపించడం లేదంటూ బాధితులు గురువారం మదురై కలెక్టర్‌ను ఆశ్రయించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో తక్షణం పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేశారు.
రైలు ఢీకొని జింకలు మృతి
అన్నానగర్: రైలు ఢీకొని ఐదు జింకలు మృతిచెందాయి. ఈ ఘటన కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలో చోటుచేసుకుంది. కుప్పనాథం ప్రాంతంలో గురువారం ఉదయం రైల్వే పట్టాల వద్ద ఐదు జింకలు మృతిచెంది ఉన్నాయి. సమాచారం అందుకున్న విరుదాచలం రైల్వే పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మృతిచెందిన జింకలను పరిశీలించి, దర్యాప్తు చేశారు. ఆహారం కోసం ఆ ప్రాంతంలోని అటవీ ప్రాంతం నుంచి వచ్చిన జింకలు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తుండగా కడలూరు నుంచి విరుదాచలం వైపు వెళుతున్న రైలు ఢీకొట్టినట్లు విచారణలో తెలిసింది.


