విజయ్‌కు విజిల్
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) కామన్ చిహ్నం కేటాయించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు అందరూ విజిల్ చిహ్నంలో అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయనున్నారు. 2026 ఎన్నికల్లో తన బలాన్ని చాటే విధంగా విజయ్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. కరూర్ విషాద ఘటనతో మీట్ ది పీపుల్ పర్యటనకు కాస్త బ్రేక్ పడినా, మళ్లీ పుంజుకునే విధంగా కార్యక్రమాల విస్తృతానికి విజయ్ కార్యాచరణలో ఉన్నారు. మళ్లీ మీట్ ది పీపుల్ ప్రచార ప్రయాణానికి సిద్ధమైనా, ఆంక్షలు, అడ్డంకులు తప్పడం లేదు. అలాగే, ఆయన చివరి చిత్రం జననాయకన్ సైతం వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఓ వైపు కరూర్ విషాద ఘటనకు సంబంధించి సీబీఐ విచారణను, మరో వైపు సెన్సార్ బోర్డు రూపంలో జననాయకన్ విడుదల సమస్యను విజయ్ ఎదుర్కొంటున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలు మందగించినట్టుగా పరిస్థితి నెలకొన్నప్పటికీ, ఇతర నేతలు మ్యానిపెస్టో రూపకల్పన, ప్రచార షెడ్యూల్ రూట్ మ్యాప్ సిద్ధం చేయడంలో బిజీగా ఉంటున్నారు. అదేసమయంలో తన నేతృత్వంలోనే కూటమి అని స్పష్టం చేసిన విజయ్ తాజాగా ఎన్నికలకు సమాయత్తం అవుతూ తమకు 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఒకే చిహ్నం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తూ ఇటీవల లేఖ పంపించారు. ఇందులో విజిల్‌కు తొలి ప్రాధాన్యత, మలి ప్రాధాన్యతగా ఆటోను ఎంపిక చేశారు. వీటితో పాటు మరో పది చిహ్నాలను సూచించినా, తమకు విజల్ లేదా ఆటోలో ఏదో ఒకటి ఎన్నికల చిహ్నంగా దక్కుతుందన్న ఆశాభావంలో తమిళగ వెట్రి కళగం వర్గాలు ఉంటూ వచ్చాయి.
కమల్‌కు మళ్లీ టార్చ్‌లైట్
మక్కల్ నీది మయ్యం నేత కమల్‌కు గతంలో కేటాయించిన టార్చ్‌లైట్ చిహ్నం మళ్లీ దక్కింది. గత ఎన్నికల్లో ఒక లోక్‌సభ, ఒక అసెంబ్లీ ఎన్నికలలో ఇదే చిహ్నంతో ప్రజల్లోకి కమల్ వెళ్లారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండడంతో బ్యాటరీ టార్చ్ లైట్ మళ్లీ దక్కేనా అన్న ప్రశ్న నెలకొంది. అయితే, అదే చిహ్నం ఆ పార్టీకి దక్కింది.
ఎట్టకేలకు విజిల్
డిసెంబర్‌లోనే తమకు చిహ్నం వస్తుందన్న ఎదురు చూపులల్లో ఉన్నప్పటికీ, చివరకు తాజాగా కామన్ చిహ్నం దక్కింది. విజయ్ ఆశించినట్టుగానే విజిల్ చిహ్నం టీవీకేకు దక్కింది. గురువారం ఎన్నికల కమిషన్ విజిల్‌ను కేటాయించింది. ఈ చిహ్నం ఆధారంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో టీవీకే అభ్యర్థులు పోటీలో ఉండబోతున్నారు. తాము ఆశించిన చిహ్నం దక్కడం ఆనందంగా ఉందని విజయ్ పార్టీ కీలక నేత నిర్మల్‌కుమార్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో విజయ్ నటించిన బిగిల్(విజిల్)చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టి ఉన్న నేపథ్యంలో తాజాగా తమకు అదే చిహ్నం దక్కడంతో కేడర్, అభిమానులు మంచి జోష్ మీదున్నారు. తమకు చిక్కిన విజిల్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీవీకే వర్గాలు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా నెల రోజుల తర్వాత పార్టీ వర్గాలతో కీలక సమావేశానికి విజయ్ నిర్ణయించారు. ఈనెల 25వ తేదీన మహాబలిపురంలో ఈ సమావేశం జరగనుంది.


