గత పాలనలో థర్మాకోల్... నేడు దోమ తెర
సాక్షి, చైన్నె : గత అన్నాడీఎంకే హయాంలో రిజర్వాయర్‌లోని నీరు ఆవిరి కాకుండా థర్మాకోల్ పరిచే ప్రయత్నం చేసి ఓ మంత్రి అభాసుపాలయ్యారు. తాజాగా అదే బాటలో దోమల వ్యాప్తిని కట్టడి చేయడానికి దోమ తెరలను కాలువల వద్ద కప్పే ప్రయత్నం చేపట్టడం అందర్నీ విస్మయంలో పడేస్తున్నది. అన్నాడీఎంకే హయాంలో మంత్రిగా ఉన్న సెల్లూరురాజు ఎండ దెబ్బకు నీటి ఆవిరిని కట్టడి చేయడానికి ఽరిజర్వాయర్‌లో థర్మాకోల్ పరిచి, అభాసు పాలు కావడమే కాకుండా, థర్మాకోల్ మంత్రిగా నేటికి ఆయన వ్యంగ్యాస్త్రాలతో పిలవబడుతున్నారు. ఈ పరిస్థితులలో తాజాగా చైన్నె కార్పొరేషన్ వర్గాలు సైతం తామేమి తక్కువ తిన్నామా అన్నట్టుగా వినూత్న ప్రయోగానికి సన్నద్ధమయ్యారు.
దోమ తెరతో..
చైన్నెలో వర్షపు నీటి కాలువల నిర్మాణాలు జరిగిన విషయం తెలిసిందే. అనేక మార్గాలలో రోడ్లలో చేరే నీరు క్షణాల్లో కాలువల ద్వారా వెళ్లేందుకు వీలుగా అక్కడక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇనుప గేట్ల తరహాలో కాలువల ముఖ ద్వారా వద్ద జరిగిన ఈ ఏర్పాట్లు వర్షపు నీరు తొలగేందుకు ఎంతో ప్రయోజకరంగా మారింది. ప్రస్తుతం ఇదే గేట్లు కాస్త విమర్శల పాలు కావడానికి పరిస్థితి తీసుకొచ్చింది, చైన్నె నగరంలోనే కాదు శివార్లలో ఇటీవల వైరల్ జ్వరాలు, చికున్ గున్యా, డెంగీ వంటి జ్వరాలు పెరుగుతూ వస్తున్నాయి. దోమల స్వైర విహారం పెరిగింది. దోమల కట్టడిలో చైన్నె కార్పొరేషన్ విఫలమైందన్న ఆరోపణలు బయలు దేరాయి. ఈ వ్యవహారం గురువారం అసెంబ్లీకి సైతం చేరింది. ఈ పరిస్థితుల్లో దోమల కట్టడికి దోమ తెర ఆయుధం అన్నట్టుగా అధికారులు వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది. తిరువొత్తియూరు, తిరువీకానగర్ మండలాల పరిధిలతోపాటు మరికొన్ని చోట్ల ఈ గేట్లకు దోమతెరను కట్టి, కాలువల్లో ఉన్న దోమలు బయటకు రాకుండా అడ్డుకట్ట వేసే విధంగా సిబ్బంది ముందుకెళ్తున్న వీడియో కాస్త వైరల్ కావడం గమనార్హం. దోమల కట్టడికి దోమ తెరే ఆయుధం అన్నట్టుగా కార్పొరేషన్ వర్గాల పనితీరుపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టే వారు పెరిగారు.


