లయన్స్ సేవలను విస్తరించాలి
వేలూరు: లయన్స్ సంఘం సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని టీకే పురం సర్పంచ్ రాజేస్ కన్నన్ తెలిపారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని తండల క్రిష్ణాపురం గ్రామంలో వేలూరు సీఎంసీ కంటి ఆస్పత్రి, లయన్స్ సంఘం, జిల్లా దృష్టి నివారణ సంఘం సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు, నిరుపేదలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులతోపాటు నిరుపేదల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి శిబిరాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి అనేక మంది పేదలకు సాయం చేయాలన్నారు. ప్రస్తుతం కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మొత్తం 120 మందికి వైద్య పరీక్షలు చేసి 31 మందికి ఉచిత శస్త్ర చికిత్సకు సిఫారస్సు చేసినట్లు తెలిపారు. కొంత మందికి ఉచిత కంటి అద్దాలను అందజేశారు. ఉపాధ్యక్షులు గీత, లయన్స్ సంఘం డాక్టర్ పొన్నంబలం, లయన్స్ సంఘం అధ్యక్షుడు సెల్వకుమార్, కార్యదర్శి నరసింహన్, కోశాధికారి కామరాజ్, సీఎంసీ క్యాంప్ కోఆర్డినేటర్ లయన్ సతీస్‌కుమార్ పాల్గొన్నారు.


