క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jan 23 2026 7:00 AM | Updated on Jan 23 2026 7:00 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

విద్యుత్‌ అవసరాలే

లక్ష్యంగా స్వెలెట్‌

సాక్షి, చైన్నె: గృహాలకు పెరుగుతున్న విద్యుత్‌ అవసరాల పరిష్కారం లక్ష్యంగా స్వెలెట్‌ క్లీన్‌ ఎనర్జీపై దృష్టి పెడుతూ కొత్త ఆవిష్కరణ చైన్నెలో చేశారు. స్వెలెట్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ వ్యవస్థాపకుడు ఆర్‌ చెల్లప్పన్‌, ఎండీ అరుల్‌కుమార్‌ షణ్ముగ సుందరం బాధ్యతాయుతమైన ఉత్పత్తి పోర్టు పోలియో, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ శ్రేణిని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త కార్పొరేట్‌ లోగో, బ్రాండ్‌ ట్యాగ్‌ లైన్‌గా పవరింగ్‌ ది వరల్డ్‌ రెస్పాన్స్‌బులిటీని ఆవిష్కరించామన్నారు. రౌండ్‌ ది క్లాక్‌ పవర్‌ కోసం పెరుగుతున్న అవసరాన్ని పరిష్కరించడానికి రూపొందించిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌, గృహ శక్తి అవసరాల పరిష్కారాల సమగ్ర శ్రేణిలు కొత్త బ్రాండ్‌ గుర్తింపుతో ముందుకు సాగనున్నాయని ప్రకటించారు.

హిందీలో ఏఐ ఫర్‌ ఆల్‌

కోర్సులు

ఐఐటీ మద్రాసు శ్రీకారం

సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసు స్వయం ప్లస్‌ హిందీలో ఏఐ ఫర్‌ ఆల్‌ కోర్సులకు శ్రీకారం చుట్టింది. గురువారం ఈ వివరాలను ఐఐటీ మద్రాసు ప్రకటించింది. ఐఐటీ మద్రాసు డీన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ సారథి పేర్కొంటూ ఉచిత ఏఐ కోర్సులలో అధ్యాపకుల కోసం ఏఐ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, అకౌంటింగ్‌, ఏఐతో క్రికెట్‌ అనలిటిక్స్‌ల గురించి వివరించారు. హిందీ వెర్షన్‌లో ఆరు ఏఐ ఫర్‌ ఆల్‌ కోర్సులు ఇప్పుడు విస్తృతం చేశామన్నారు. కళలు, సైన్స్‌, వాణిజ్యం, అనుబంధ విభాగాల నుంచి విద్యార్థులు, నిపుణులు భాషా అడ్డంకులను తొలగించడానికి, అవగాహనను పెంపొందించేందుకు ఈ చొరవ రూపొందించినట్టు వివరించారు. ప్రతి కోర్సు 25 నుంచి 45 గంటల వ్యవధి కలిగి ఉంటుందని దీనిని ఉచితంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు అని పేర్కొంటూ, స్వయం ప్లస్‌లో ఈనెల 26వ తేదీలోపు ఆసక్తిగల వారు పేరు నమోదు చేసుకోవచ్చు అని సూచించారు.

కల్యాణ మండపాల

పనుల పరిశీలన

కొరుక్కుపేట: పెరంబూరులోని చంద్రయోగి సమాధి రోడ్డులో కొత్తగా నిర్మించిన కల్యాణ మండపం చివరి దశలను హిందూ ధర్మాదాయ శాఖా మంత్రి పి.కె. శేఖర్‌బాబు గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది తైపూసం పండుగ కోసం హిందూ, దేవదాయ శాఖ వివిధ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఆయన అన్నారు. నార్త్‌ చైన్నె డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు క్రింద, రోజువారీ వేతనాలు పొందేవారు ప్రభుత్వ ఉద్యోగులు వంటి ఆర్థికంగా వెనుకబడిన వారు ఇంటి పనులకు అధిక రుసుములు వసూలు చేస్తున్నందున వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రహించి కల్యాణ మండపాలను నిర్మిస్తున్నామని చెప్పారు. మొదటి దశలో గత నెల 18న కొలత్తూరులోని జి.కె.ఎం, కాలనీలో అన్నా వివాహ మందిరాన్ని సీఎం స్టాలిన్‌న్‌ ప్రారంభించారన్నారు. చైన్నెలో కొత్తగా నిర్మిస్తున్న 8 కల్యాణ మండపాలను ఫిబ్రవరి 28 తేదీ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. పెరంబూరులోని చంద్రయోగి సమాధి రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న అంబేడ్కర్‌ కల్యాణ మండపం చివరి దశ నిర్మాణ పనులు పీఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. మేయర్‌ ప్రియా, పీఎండీఏ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌, సెంట్రల్‌ సర్కిల్‌ మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ హెచ్‌.ఆర్‌. కౌశిక్‌ పాల్గొన్నారు.

ప్రాణం తీసిన బైక్‌

అన్నానగర్‌: బైక్‌లో కూర్చుని ఆడుకుంటుండగా అదుపుతప్పి బావిలో పడడంతో ఓ బాలిక మృతిచెందింది. మదురై జిల్లాలోని ఉసిలంపట్టి సమీపంలోని సర్ధిపట్టికి చెందిన పాండి కుమార్తె హాసిని(14). ఈమె బుధవారం సాయంత్రం, తన సోదరుడు కబిలన్‌తో కలసి ఇంటి ముందు పార్క్‌ చేసిన బైక్‌పై ఆడుకుంటోంది. బాలిక హఠాత్తుగా బైక్‌ను స్టార్ట్‌ చేయడంతో అదుపుతప్ని బైక్‌ సహా ఇద్దరు సమీపంలోని బావిలో పడ్డారు. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హాసిని చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులుకేసు దర్యాప్తు చేస్తున్నారు.

జాలరికి యావజ్జీవ శిక్ష

తిరువొత్తియూరు: నగదు ఇచ్చి పుచ్చుకోవడంలో ఏర్పడిన వివాదంలో జాలరిని మునగ చెట్టు కొమ్మతో కొట్టి హత్య చేసిన స్నేహితుడికి చైన్నె సెషన్స్‌ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. చైన్నె , కాసిమేడు ప్రాంతంలో ఫిషింగ్‌ బోట్‌ రోజూవారీ కూలీలుగా పనిచేసే స్నేహితులు సతీష్‌కుమార్‌ సురేష్‌, వీరి మధ్య నగదు లావాదేవీలపై తరుచుచూ గొడవలు జరిగేవి. ఫిబ్రవరి 2015లో, వారి మధ్య ఏర్పడిన గొడవలో సతీష్‌కుమార్‌ మునగ చెట్టు కొమ్మతో సురేష్‌పై దాడి చేశాడు. దాడిలో సురేష్‌ మృతి చెందాడు. అతని తల్లి తైలమ్మాళ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కాసిమేడు పోలీసులు సతీష్‌కుమార్‌పై హత్యకేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. చైన్నె జిల్లా 3వ అదనపు సెషన్స్‌ కోర్టులో న్యాయమూర్తి కె. గీతారాణి ఎదుట ఈ కేసు విచాణకు వచ్చింది. ప్రభుత్వ క్రిమినల్‌ న్యాయవాది టి. సురేష్‌ హాజరై పోలీసుల తరఫున వాదించారు. వాదనలు విన్న తర్వాత, న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ నేరం రుజువైందని పేర్కొంటూ, సతీష్‌కుమార్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement