పరిశోధన విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
వేలూరు: విద్యార్థులు మేధాశక్తితో పరిశోధన విద్య కు అఽధిక ప్రాధాన్యత ఇవ్వాలని పాఠశాల చైర్మన్ దిలీప్‌కుమార్ జైన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని బీఎండీ జైన్ పాఠశాలలో విద్యార్థులకు స్నాతకోత్సవ కార్యక్రమం పాఠశాల కార్యదర్శి రాజేష్‌కుమార్‌జైన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యలోనే విద్యార్థులకు క్రమ శిక్షణను అలవాటు చేయాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంతో పాటు తల్లి దండ్రులపై ఆధారపడి ఉందన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదివే విధంగా అలవాటు చేయాలే తప్ప కఠినంగా శిక్షించి ప్రతి నిమిషం చదువుపైనే ధ్యాస పెట్టే విధంగా చేయరాదన్నారు. పాఠశాల, ఇంటి వద్ద కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వారు క్రమ శిక్షణ గల విద్యార్థులుగా ఉండగలరన్నారు. విద్యార్థులు ప్రతి రోజూ యోగా చేయడం అవసరమన్నారు. ఇటీవల సెల్‌ఫోన్‌లకు చిన్న వయస్సు నుంచి పెద్ద వారు వరకు బానిసగా మారారని వాటిని నుంచి బయటకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ మాలతి, విద్యార్థులు పాల్గొన్నారు.


