ఫలించిన పీయూష్ తంత్రం
సాక్షి, చైన్నె: కేంద్ర మంత్రి, తమిళనాడు బీజేపీ ఎన్నిక ల ఇన్‌చార్జ్ పీయూష్ గోయల్ రాజకీయ వ్యూహాల తంత్రం ఫలించింది. అన్నాడీఎంకే నుంచి చీలికతో ఆవిర్భవించిన టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను మళ్లీ ఎన్‌డీఏ కూటమిలోకి తీసుకొచ్చారు. తమిళనాట అధికారం ఎన్‌డీఏ కూటమిదే అని టీటీవీ స్పష్టం చేయగా, అందరం కుటుంబ సభ్యులవలే కలసి పనిచేసి మంచి నాయకత్వంతో, సుపరిపాలనను తమిళనాట తీసుకొస్తామని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. టీటీవీ రాకను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఆహ్వానించారు.
అన్నాడీఎంకే నుంచి చీలికతో దివంగత సీఎం జయలలిత పేరిట అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించిన విషయం తెలిసిందే. తొలుత పార్టీకి ప్రధాన కార్యదర్శిగా శశికళ పేరును ప్రకటించారు. అయితే, అన్నాడీఎంకే కై వశం లక్ష్యంగా సాగిస్తున్న న్యాయపోరాటం నేపథ్యంలో ఆమె పేరును తప్పించి, చివరకు తానే ప్రధాన కార్యదర్శి అని టీటీవీ దినకరన్ ప్రకటించుకున్నారు. దక్షిణ తమిళనాడులోనే కాదు, కొంగు మండలంలోని ముక్కళ్లత్తార్ సామాజిక వర్గం మెజారిటీ శాతం టీటీవీ వెన్నంటి ఉంటూ రావడం తాజా ఎన్నికల నేపథ్యంలో ఆయనకు డిమాండ్ పెరిగింది. అంతకు ముందు లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డీఏ కూటమితో కలసి ఎన్నికల్లోకి వెళ్లిన సమయంలో బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడంలో టీటీవీ పాత్ర ఉందని చెప్పవచ్చు. ఎన్నికల అనంతరం ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చిన దినకరన్ విజయ్ తమిళగ వెట్రి కళగంతో కలిసి ఎన్నికలలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. దినకరన్‌ను ఎన్‌డీఏ కూటమిలోకి మళ్లీ తీసుకొచ్చే దిశగా బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ పీయూష్ గోయల్ గత రెండు రోజులుగా వ్యూహాలకు పదును పెట్టారు. చివరకు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అభయాన్ని సైతం దినకరన్ స్వీకరించినట్టు సమాచారం.
ఎట్టకేలకు ఎన్‌డీఏలోకి టీటీవీ
పీయూష్ గోయల్ వ్యూహాలు బుధవారం ఫలించా యి. అమిత్‌షా ఇచ్చిన అభయంతో దినకరన్ ఎన్‌డీఏలోకి మళ్లీ చేరారు. నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో పీయూష్ గోయల్, సహాయ మంత్రి ఎల్ మురుగన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమక్షంలో ఎన్‌డీఏ కూటమితో టీటీవీ చే తులు కలిపారు. ఆయన మీడియా మాట్లాడుతూ త మిళనాడులో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి సీఎం అభ్యర్థిగా పళణిస్వామిని అంగీకరిస్తారా అని ప్రశ్నించగా, కూటమి సీఎం అభ్యర్థి ఎవరో మీడియాకు ఇప్పటికే తెలుసునని, అలాంటప్పుడు ఈ ప్రశ్న అవసరయా అని దాట వేశారు. పీయూష్ గోయల్ మాట్లాడుతూ, 2026 ఎన్నికలలో పళణి స్వామి, అన్బుమణి, వాసన్, దినకరన్ కుటుంబ సభ్యుల్లా కలసి పనిచేస్తామన్నారు. ఎన్‌డీ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత పాలన మళ్లీ తమిళనాట తీసుకొస్తామన్నారు. నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ శశికళ తమకు మద్దతు ఇస్తే మంచిదని, ఆనందంగా ఆమె మద్దతును స్వీకరిస్తామని వ్యాఖ్యలు చేశారు. దినకరన్ ఎన్‌డీఏ కూటమిలోకి రావడాన్ని పళణిస్వామి ఆహ్వానించారు. అందరం కలిసి పనిచేస్తామని, అధికారం చేజిక్కించుకుంద్దామని వ్యాఖ్యలు చేశారు. ఇక, ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సైతం ఎన్‌డీఏ కూటమిలో చేరబోతున్నట్టుగా సమాచారం. అయితే, తమను ఎవ్వరూ సంప్రదించ లేదని, ఎలాంటి చర్చలు జరగలేదని ప్రేమలత ఖండించారు.
మధురాంతకంలో ఏర్పాట్ల పరిశీలన
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో బహిరంగ సభకు ఏర్పాట్లు విస్తృతమైన విషయం తెలిసిందే. ఈ వేదికపై నుంచి కూటమి పార్టీల నేతలందర్నీ మోదీ పరిచయం చేసి ఎన్‌డీఏ కూటమిని ప్రకటించనున్నారు. ఇందుకోసం ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పీయూష్ గోయల్, ఎల్ మురుగన్, నైనార్ నాగేంద్రన్, బీజేపీ వర్గాలు సాయంత్రం పరిశీలించారు. భారీ జన సమీకరణ దిశగా కసరత్తులు చేపట్టారు.
ఎన్‌డీఏలోనే ఐజేకే
ఎన్‌డీఏ కూటమిలో ఐజేకే అని ఆ పార్టీ వ్యవస్థాపకుడు టీఆర్ పారివేందర్, అధ్యక్షుడు రవి పచ్చముత్తు ప్రకటించారు. బుధవారం సాయంత్రం కాటాన్ కొళత్తూరులో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్ పీయూష్ గోయల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌లతో ఐజేకే నేతల భేటీ జరిగింది. పారివేందర్ మాట్లాడుతూ, ఐజేకేకు పీఎం మోదీ ఆదర్శమని, తాము ఎన్‌డీఏ కూటమితోనే ఎన్నికల్లోకి వెళ్లనున్నామని ప్రకటించారు. అయితే, పార్టీ గుర్తింపు దక్కించుకునేందు కోసం ప్రత్యేక చిహ్నంలో ఈసారి పోటీ చేయనున్నామన్నారు.
కూటమిలోకి టీటీవీని ఆహ్వానిస్తున్న గోయల్
పీయూష్ గోయల్‌తో టీటీవీ దినకరన్ కరచాలనం
ఫలించిన పీయూష్ తంత్రం


