డీఎంకేలోకి వైద్య లింగం
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ సీఎం పన్నీరుసెల్వం మద్దతుదారుడు ఆర్ వైద్య లింగం డీఎంకేలో చేరారు. బుధవారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. డెల్టాలో కీలకంగా ఉన్న తంజావూరు జిల్లాలో పలుకుబడి కలిగిన నేతగా అన్నాడీఎంకేలో ఆర్ వైద్యలింగం ఉంటూ వచ్చారు. 2001, 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఒరత్తనాడు నుంచి గెలిచారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2016లో ఆయన్ను రాజ్యసభకు పంపించారు. 2021 ఎన్నికలలో మళ్లీ ఒరత్తనాడు నియోజకవర్గం నుంచి గెలిచారు. అన్నాడీఎంకేలో వివాదాల నేపథ్యంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం వెన్నంటి చేరిన ఎమ్మెల్యేలలో ఆర్ వైద్య లింగం కూడా ఉన్నారు. ఆలంకులం నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మనోజ్ పాండియన్ సైతం వైద్యలింగంతో కలసి మాజీ సీఎం పన్నీరుసెల్వం శిబిరంలో కీలకంగా ఉంటూ వచ్చారు. గత నాలుగేళ్లుగా పన్నీరుసెల్వం శిబిరంలో ఉంటూ అన్నాడీఎంకేను కై వశం చేసుకునే వ్యూహాలకు పదును పెడుతూ వచ్చారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. రెండు నెలల క్రితం మనోజ్‌పాండియన్ డీఎంకే గూటికి చేరారు. అదే సమయంలో ఆర్ వైద్యలింగం సైతం డీఎంకేలోకి చేరడం ఖాయం అనే ప్రచారం జరిగింది. అయితే, తన మద్దతు దారులతో కొన్ని నెలల పాటు చర్చలు జరుపుతూ వచ్చిన వైద్యలింగం ఎట్టకేలకు డీఎంకేలో చేరడానికి సిద్ధమయ్యారు.
స్టాలిన్ సమక్షంలో చేరిక...
మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతో కలసి చైన్నె తేనాంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో బుధవారం అడుగుపెట్టారు. సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రులు నెహ్రూ, కోవిచెలియన్, ఏవీవేలు, టీకేఎస్ ఇలంగోవన్, ఆర్‌ఎస్ భారతీ, ఎంపీ దయానిధి మారన్ వైద్యలింగంను ఆహ్వానించి అభినందనలు తెలియజేశారు. మీడియాతో వైద్యలింగం మాట్లాడుతూ పన్నీరుసెల్వం త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు వ్యాఖ్యలు అందుకున్నారు. తాను మాతృ సంస్థలోకి వచ్చానని, ఇందులో తప్పేమి లేదన్నారు. అన్నాడీఎంకేలో నియంత వలే సర్వాధికారంతో పళణిస్వామి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మాతృ సంస్థల అభ్యున్నతికి , మళ్లీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ముందుగా పెరంబలూరు జిల్లాకు చెందిన అన్నాడీఎంకే నేత, కున్నం మాజీ ఎమ్మెల్యే ఆర్‌టీ రామచంద్రన్ సైతం డీఎంకేలో చేరారు. కాగా, అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి వెల్లమండి నటరాజన్ సైతం డీఎంకేలో చేరతారన్న ప్రచారం జరిగినా, ఆయన చివరి క్షణంలో యూటర్న్ తీసుకున్నట్టు చర్చ. తాను పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేలోనే కొనసాగుతానని వెల్లమండి నటరాజన్ స్పష్టం చేశారు.
పన్నీరు దారెటో..?
మాజీ సీఎం పన్నీరు శిబిరంలోని ముఖ్య నేతలందరూ డీఎంకేలోకి వెళ్తుండడంతో అక్కడున్న ద్వితీయ శ్రేణి నేతలందరూ తమ రాజకీయ భవిష్యత్తు దిశగా ప్రత్యామ్నాయంగా దృష్టి కేంద్రీకరించే పనిలో పడ్డారు. ఈ దృష్ట్యా, త్వరలో పన్నీరు శిబిరం ఖాళీ అయ్యే అవకాశాలు ఎక్కువే. ఈపరిణామాల నేపథ్యంలో పన్నీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఎదురుచూపులు రాజకీయవర్గాల్లో పెరిగాయి.


