చిన్నమ్మ ఆవేదన!
న్యూస్‌రీల్
– తన దారి ఐక్యతే అని స్పష్టం
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేకు చెందిన నేతలు డీఎంకే బాట పడుతుండడం, తన ప్రతినిధి టీటీవీ దినకరన్ ఏన్‌డీఏ కూటమిలో చేరడం వంటి పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మ శశికళ తీవ్ర ఆవేదనతో బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకేలో కొందరి కారణంగా జరుగుతున్న పరిణామాల వేదన కలిగిస్తున్నాయన్నారు. ఒకప్పుడు అమ్మ జయలలిత ప్రసన్నం కోసం జాతీయ స్థాయి నేతలు పడిగాపులు కాసేవారు అని, ఇప్పుడు జాతీయ నేతల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత జీవించి ఉన్న కాలంలో అన్నాడీఎంకేలో చేరేందుకు డీఎంకేతోపాటు ఇతర పార్టీల నుంచి కేడర్ క్యూకట్టేవారు అని వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా అన్నాడీఎంకే నుంచి డీఎంకే వైపుగా వెళ్లేవారి సంఖ్య పెరగడం ఆవేదన కలిగిస్తున్నదన్నారు. ఇది స్టాలిన్‌కు బలాన్ని కలిగిస్తుందని, అన్నాడీఎంకేకు నష్టాన్ని చేకూరుస్తుందని హెచ్చరించారు. ఎవరు ఏ పార్టీలోకి వెళ్లినా, ఎవరు ఏ కూటమిలోకి వెళ్లినా తన దారిలో మాత్రం మార్పు లేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకేలో అందరూ ఐక్యంగా ఉండాలన్నదే తన ప్రయాణమని, ఇది కొనసాగుతుందన్నారు. డీఎంకేను అంతమొందించడం లక్ష్యమని, ఇదే అమ్మ ఆశయం అని, ఈ ప్రయాణంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి
రూ.3 వేల మనియార్డర్
సాక్షి, చైన్నె: సంక్రాంతి కానుక రూ.3 వేలను ప్రభుత్వానికి ఓ సామాజిక కార్యకర్త మనియార్డరు రూపంలో వెనక్కి అందజేశాడు. సంక్రాంతి సందర్భంగా కుటుంబ రేషన్ కార్డుదారులకు రూ.3 వేల నగదు కానుకను ప్రభుత్వం అందజేసిన విషయం తెలిసిందే. అయితే, తిరునల్వేలికి చెందిన సామాజిక కార్యకర్త క్రిస్టోఫర్ తనకు అందజేసిన రూ.3 వేలను ప్రభుత్వానికి వెనక్కి పంపించారు. సచివాలయం చిరునామాతో చైన్నెకి అంబాసముద్రం పోస్టాఫీసు నుంచి బుధవారం మనీయార్డర్ చేయడం గమనార్హం. ప్రభుత్వ ఖజానాపై ఇప్పటికే భారం ఎక్కువగా ఉందని, అందుకే తాను వెనక్కి ఇచ్చినట్టు క్రిష్టోఫర్ పేర్కొన్నారు.
25న టైంక్యాట్–2026 ప్రతిభా పరీక్ష
సాక్షి, చైన్నె: క్యాట్ 2026 విద్యార్థుల కోసం టైమ్ ఇన్‌స్టిట్యూట్ నేతృత్వంలో స్కాలర్ షిప్, టైమ్ టాలెంట్ సెర్జ్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఈ వివరాలను బుధవారం టైమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. రెండు శ్లాట్‌లలో ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఈ ప్రతిభా పరీక్ష జరుగుతుందని వివరించారు. జనవరి 25న జరిగే ఈ పరీక్షకు తమ వెబ్‌సైట్‌లో పేర్లను విద్యార్థులు నమోదుచేసుకోవచ్చు అని సూచించారు. టైమ్ టాలెంట్ సెర్జ్ ఎగ్జామినేషన్‌లో క్వాంటిటేటివ్, లాజికల్, వెర్బల్ ఎబిలిటీకి సంబంధించిన బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయని వివరించారు. గంట వ్యవధిలో ఆన్‌లైన్ మోడ్ ద్వారా పరీక్ష ఉంటుందని, ఈ పరీక్ష క్యాట్ 2026కు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఇన్‌స్టి ట్యూట్ ప్రకటించింది.


