చైన్నెలో కేరళ పర్యాటక రోడ్ షో
సాక్షి, చైన్నె: చైన్నెలో కేరళ ప్రభుత్వ పర్యాటక రంగ విశిష్టతను చాటేవిధంగా రోడ్ షో జరిగింది. ఈసందర్భంగా అక్కడి సంప్రదాయ నృత్య ప్రదర్శనలు అలరించాయి. రానున్న వేసవి సెలవుల సీజన్‌లో కేరళ వైపు పర్యాటకులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలలో రోడ్‌షో నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. చైన్నెలో జరిగిన రోడ్‌షోకు విశేష స్పందన వచ్చిందని బుధవారం ఆ రాష్ట్ర మంత్రి పీఏ మహ్మద్‌రియాజ్ తెలిపారు. 22వ తేదీన బెంగళూరులో, రానున్న రెండు నెలల్లో హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్‌లలో కూడా రోడ్‌షోలు, బీ2బీ సమావేశాలు నిర్వహించనున్నామని వివరించారు.
కేరళలోని వారసత్వ, చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ప్రాంతాల గురించి ఈసందర్భంగా విశదీకరించారు. కోలికోడ్, వయనాడ్, మూనార్, వంటి పర్యాటక కేంద్రాల గురించి, సర్పింగ్, సైక్లింగ్, పారా గ్‌లైడింగ్, మౌంటైన్ బైకింగ్, ఆయుర్వేదం అంశాలను గుర్తు చేశారు.


