మృతులకు సంతాపంతో సరి!
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాల్లో రెండవ రోజున బుధవారం సంతాప తీర్మానాలతో సరి పెట్టారు. ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రముఖులకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు. 2026 కొత్త సంవత్సరంలో తొలి అసెంబ్లీ సమావేశం మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజున గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రసంగం వ్యవహారం ప్రతి ఏటా వలే ఈ సారి కూడా వివాదాలమయంగానే మారింది. రెండవ రోజున ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ అప్పావు సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టారు. ఇటీవల మృతిచెందిన సెంతామంగళం ఎమ్మెల్యే పొన్నుస్వామికి సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన రాజకీయ ప్రయాణం, ప్రజాసేవను ఈసందర్భంగా స్పీకర్ అప్పావు గుర్తు చేశారు. అనంతరం నిర్మాత ఏవీఎం శరవణన్, మురుగప్ప గ్రూప్ మాజీ చైర్మన్ అరుణాచలం వెల్లయన్, ప్రముఖ కవి తమిళన్బన్‌లకు అసెంబ్లీ నివాళులర్పించింది. మాజీ ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వం, ఎల్ గణేషన్, మాజీ లోక్‌సభ స్పీకర్ శివరాజ్‌పాటిల్‌తోపాటు మరి కొందరు ప్రముఖుల మృతికి అసెంబ్లీలో నివాళులర్పించారు. అనంతరం సభను స్పీకర్ అప్పావు గురువారానికి వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగంపై సభలో చర్చ జరగనుంది.


