మైలార్డ్ అంటున్న శశికుమార్
తమిళసినిమా: ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న నటుడు శశికుమార్ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మైలార్డ్. నటి చైత్ర జే.అసార్ నాయకిగా నటిస్తున్న ఇందులో గురుసోమసుందరం, ఆషా శరత్, గోపి నయినార్, వసుమిత్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత రాజు మురుగన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని అంబేద్కుమార్ సమర్పణలో ఓలింపియా మూవీస్ పతాకంపై జయంతి అంబేద్కుమార్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదలు చేశారు. అందులో న్యాయమూర్తిగా నటిస్తున్న శశికుమార్ బడుగువర్గాల పక్షాన మాట్లాడే సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఇది రాజకీయ అధికారంలో చిక్కుకునే బడుగు వర్గాల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. భావోద్రేకాలతో కూడిన పలు సన్నివేశాలు ఇందులో చోటుచేసుకుంటాయని చెప్పారు. చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని చెప్పారు. శశికుమార్, దర్శకుడు రాజుమురుగన్ కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం కావడంతో మైలార్డ్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఈ చిత్రానికి నీరవ్‌షా చాయాగ్రహణం, శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మైలార్డ్ అంటున్న శశికుమార్


