20 డబుల్ డెక్కర్ బస్సులు
సాక్షి, చైన్నె : చైన్నెలో డబుల్ డెక్కర్ బస్సుల సేవలను విస్తృతం చేయడానికి ఎంటీసీ చర్యలు తీసుకుంది. ఏసీ సౌకర్యంతో కూడిన 20 బస్సులను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. 1970 నుంచి 2007 వరకు చైన్నెలో డబుల్ డెక్కర్ బస్సుల సేవలు విస్తృతంగా ఉండేవి. ఆతర్వాత చైన్నె నగరంలో వంతెనల సంఖ్య పెరగడంతో డబుల్ డెక్కర్ స్థానంలో డీలక్స్ బస్సులు వచ్చాయి. ఎంటీసీ నేతృత్వంలో డీలక్స్ బస్సులు ఓ వైపు, ఎలక్ట్రిక్ బస్సులు మరో వైపు విస్తృతంగా వివిధ మార్గాలలో సేవలను అందిస్తున్నాయి. ఈ పరిస్థితులలో చైన్నెలో జరిగిన ప్రవాస తమిళుల దినోత్సవంలో ఓ డబుల్ డెక్కర్ బస్సును ప్రభుత్వానికి అందజేశారు. ఈనెల 12న ఈ బస్సుకు సీఎ స్టాలిన్ జెండా ఊపారు.
తొలి విడతగా పర్యాటక ప్రాంతాలను కలిపే విధంగా ఈ బస్సుల సేవలను అందిస్తున్నారు. ఇందుకు అమిత స్పందన వస్తున్నది. రిప్పన్ బిల్డింగ్, లైట్‌హౌస్, జల్లికట్టు ఎద్దుతో పాటు తమిళ సంస్కృతిని చాటే పెయింటింగ్స్‌తో తమిళం వర్ధిల్లాలి అన్న నినాదంతో ఉన్న ఈ బస్సుకు వస్తున్న స్పందనతో మరో 20 బస్సులను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు. అశోక్ లేలాండ్‌తో కుదిరిన ఒప్పందం మేరకు 20 బస్సులను సిద్ధం చేయించే పనిలో పడ్డారు. ఈ బస్సులను మార్చి నెలాఖరులోపు చైన్నెలో పలు పర్యాటక మార్గాలను అనుసంధానించే విధంగా రోడ్డెక్కించే విధంగా రవాణా సంస్థ అధికారులు ముందుకెళ్తున్నారు.


